పది బుల్డోజర్లు ఒకేసారి వచ్చి గుద్దుకున్నట్లు తీవ్రంగా కంపించింది ఆ భవనం. ప్రేలుడు అదటుకు నామరూపాలు లేకుండా నాశనం అయింది ముందు గది... గాలిలో ఎగురుకుంటూ వచ్చి మధ్యగదినిండా పరుచుకున్నాయి పెద్ద పెద్ద కాంక్రీట్ అచ్చులు.
"ఇక్కడి గోలను ఆలకించి చుట్టుపట్లవున్న పౌరులందరూ వచ్చిపడేలోపల పూర్తి అయిపోవాలి మన పని... పదండి... లోపలికి పదండి...” ఖంగుమంటున్న కంఠంతో ఆజ్ఞలు జారీచేస్తూ శిథిలమైన ముఖద్వారం దగ్గర ప్రత్యక్షం అయ్యాడు లావుగా ఎత్తుగా వున్న ఆగంతకుడు ఒకతను.
నల్లని దుస్తులు ధరించి అతని వెనుకే ప్రత్యక్షం అవుతున్న మరో పదిమంది వ్యక్తుల్ని చూసేసరికి చీమలుపాకినట్లు జలదరించింది ఒక గోడను ఆనుకొని బోర్లాపడివున్న షాడో శరీరం.
"మజ్దూర్ చేతిలో బంధింపబడి వున్న అహూజా కోసం తామే కాదు... తమకు తెలియని మరోపార్టీ కూడా బయలుదేరి వచ్చింది... ఏమాత్రం ఆలస్యం చేసినా తమ కళ్ళముందే తమ స్నేహితుడిని ఎగరేసుకుపోతుంది.
ఆ ఆలోచన అతని మనస్సులో మెదులుతుండగానే అతన్ని, మిగిలిన యిద్దర్నీ గమనించారా ఆగంతకులు.
"ఫైర్... ఫైర్...” పెద్ద కంఠంతో ఆర్డర్ యిస్తూ తన చేతిలోని రివాల్వర్ని షాడోకేసి తిప్పాడు వారి నాయకుడు.
అదిరిపడి ఒక్క గంతులో లేచాడు షాడో. తల్లకిందులుగా పల్టీకొట్టి అహూజా వున్న గదిలో పడ్డాడు.
ప్రేలుడు అదటుకు తల్లక్రిందులై అప్పుడే లేచి నిలబడుతున్నాడు మజ్దూర్. సడన్‌గా ప్రత్యక్షం అయిన పర్సనాలిటీని గమనించి వెర్రిగా అరుస్తూ, పాంటు బెల్టు వెనుకనుంచి తనుకూడా లాగాడు ఒక రివాల్వర్ని.
"ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే మాటకు అర్థం యిదే కాబోలు... కొట్టు గురూ! పళ్ళు రాలిపోయేటట్లు కొట్టు” అని అరుస్తూ షాడో వెనుక ఆ గదిలోకి జంప్ చేశాడు శ్రీకర్. షాడో కొట్టేదాకా వెయిట్ చేయకుండా తానే కొట్టాడు లాగిపెట్టి అతని ముఖంమీద.
చేతిలోని రివాల్వర్ ఎగిరి అవతల పడిపోయింది. బాధగా అరిచి తనుకూడా ఎగిరి ఒక గోడకు గుద్దుకున్నాడు మజ్దూర్.బయటి గది దగ్గర్నించి వస్తున్న బుల్లెట్స్‌కి అందకుండా అటూ ఇటూ జంప్ చేస్తూ తన రివాల్వర్‌తో అగంతకుల్ని అడ్డుకున్నాడు ముఖేష్. ముందుకు పరిగెత్తుకుంటూ రాకుండా ఆపాడు.
ఆ కాస్త వ్యవధిలోను బూటు ప్రక్కన బిగించివున్న డాగర్ని బయటికి లాగి అహూజా కాళ్ళు చేతుల్ని బంధించివుంచిన తాళ్ళను కోసేశాడు షాడో. స్పృహలేని అతన్ని ఎత్తి భుజంమీద వేసుకుంటూ వెనుకభాగంలో కనిపించిన ఒక ద్వారం వైపు పరిగెత్తాడు.
“మైగాడ్! పారిపోతున్నారు... మనకి కావల్సిన మనిషిని తీసుకొని యిక్కడినుంచి పారిపోతున్నారు... పట్టుకోండి... వాళ్ళని పట్టుకోండి...” ప్రేలుడు అదటుకు పడిపోకుండా వున్న గోడలు అదిరిపోయేలా అరుస్తూ చేతిలోని రివాల్వర్ని వదిలి, వీపుకు వ్రేలాడదీసుకున్న మిషన్గన్ని అందుకున్నాడు ఆగంతకుల నాయకుడు.చటుక్కున తన రివాల్వర్ని పాంటుజేబులోకి నెట్టేశాడు ముఖేష్. తన పాదాల దగ్గిర కనిపించిన రెండు కాంక్రీట్ అచ్చుముక్కల్ని వారిమీదికి విసిరి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అహూజాతోపాటు షాడో శ్రీకర్ బయటికి పోయిన ద్వారం గుండా తనుకూడా చీకట్లలోకి పరుగుతీశాడు.
