-
-
బ్రహ్మసూత్రములు
BrahmaSutramulu
Author: K. Venkata Rao
Pages: 590Language: Telugu
బ్రహ్మసూత్రములు
(మధ్వభాష్య సహితము)
ప్రస్థాన త్రయములో శ్రీమద్భగవద్గీతపై తెలుగు భాషలో వెలువడినన్ని గ్రంథములు, వ్యాఖ్యానములు బ్రహ్మసూత్రములపై వెలువడలేదని చెప్పవచ్చును. బ్రహ్మసూత్రములపై మూడు భాష్యములు ప్రసిద్ధము. అవి శంకర, రామానుజ, మధ్వ భాష్యములు. ఈ మూడును సంస్కృత భాషలో నున్నవి.
సుమారు 75 సంవత్సరములకు పూర్వము పిఠాపురం వాస్తవ్యులు, కీ.శే. శ్రీ హుండీ రామారావుగారు బ్రహ్మసూత్రములపై మధ్వ భాష్యమునకు తెలుగులో ప్రతిపదార్థము రచించిరి. వారు రచించిన ప్రతిపదార్థసహిత బ్రహ్మసూత్రభాష్యములోని నాలుగు అధ్యాయములు నాలుగు సంపుటములుగా ప్రచురింపబడినవి. ఈ నాలుగు సంపుటములను మా పితామహులు కీ.శే. శ్రీ ఖరిడేహాల్ శ్రీనివాసరావుగారు తమ స్వంత వేదవ్యాస ముద్రణాలయంలో ముద్రించి ప్రచురించిరి. ప్రథమాధ్యాయము 1927లో ప్రచురింపబడగా, నాలుగవ అధ్యాయము 1930లో ప్రచురింపబడినది. ఈ సంపుటములందు సూత్రములు, భాష్యములోని సంస్కృత పదములకు తెలుగులో ప్రతిపదార్థము చెప్పబడియున్నది.
బెంగుళూరులోని శ్రీ వ్యాస మధ్వ సేవా ప్రతిష్ఠానమ్ వారు శ్రీ మధ్వాచార్యులవారు రచించిన గ్రంథములన్నింటిని ఆరు సంపుటములుగా తెలుగు లిపిలో ప్రచురించినారు. దేవనాగరలిపి తెలియనివారి పఠన సౌలభ్యము కొరకు తెలుగు లిపిలో ప్రచురించినట్లు తెలిపియున్నారు. అయితే సంస్కృత భాష రాని వారు దానిని చదువగలిగినను అర్థము చేసుకొనలేరు. పై ఆరు సంపుటములలో బ్రహ్మసూత్రభాష్యము ద్వితీయ సంపుటములో నున్నది. ఈ సంపుటమును చూచిన పిమ్మట సూత్రములకు భాష్యమునకు తెలుగులో వాటి యొక్క భావము వ్రాసియుండినచో బాగుండెడిదని నాకు తోచినది. వెంటనే ఆ కార్యము చేపట్టవలెనను దృఢ సంకల్పము ఏర్పడినది. నాకు సంస్కృతభాష బాగుగా తెలియక పోవుటచేత, శ్రీ హుండీ రామారావుగారు రచించిన ప్రతిపదార్థమును ఆధారముగా చేసుకొని తెలుగులో వాక్యరూపమున రచించినాను. సనాతన శాస్త్రగ్రంథములును, ముఖ్యముగా ద్వైతమత గ్రంథములను పఠించుటయందు ఆసక్తిగలవారు ఈ గ్రంథము నాదరించి శ్రీహరి వాయు కృపకు పాత్రులు కాగలరని ఆశించుచున్నాను.
- ఖరిడేహాల్ వేంకటరావు
