-
-
బోన్సాయ్ మనుషులు
Bonsai Manushulu
Author: Simha Prasad
Publisher: Sri Sri Prachuranalu
Pages: 194Language: Telugu
ఉదయం పూట అంతా రకరకాల పనుల మీద వెళ్తూంటారు గనుక సాయంత్రం భోజనం మాత్రం అంతా కలిసే చెయ్యాలనేవారు. అంచేత అంతా ఠంచనుగా ఏడున్నర అయ్యేసరికి ఇంటికి చేరేవాళ్ళం.
మగవాళ్ళమంతా వరుసగా పీటలు వాల్చుకుని కూర్చుని భోంచేసేవాళ్ళం. ఇంటి విషయాలూ, ఊరి విషయాలూ నాన్నగారు చెబుతుంటే ఆసక్తిగా వింటూ తినేవాళ్ళం. మధ్య మధ్య మా అభిప్రాయాలు కనుక్కుంటూ మా గురించి, మా చదువుల గురించి తెలుసుకుంటూండేవారు.
ఒకరకంగా రాత్రి భోజన సమయం మా ఇంటి సమావేశంలా ఉండేది. అందరికీ అన్ని విషయాలూ తెలిసేవి. ఒకరి గురించి ఒకరికి తెలిసేది. అభిమానాలూ, అప్పాయతలూ పెరిగేవి. అంతా ఒకటి అన్న భావం బలంగా నాటుకొనేది.
మగవాళ్ళ భోజనాలయ్యాక ఆడవాళ్ళంతా కూర్చునేవారు. కష్టసుఖాలు కలబోసుకునేవారు. పని పాటల గురించి మాట్లాడుకునేవారు.
మొత్తానికా సమావేశాలు ఎంతో ఉపయోగకరంగా, ఉత్తేజకరంగా ఉండేవి. అరమరికలు లేకుండా అంతా కలిసి ఉండడంలో ఉన్న ఆనందం, అనుభూతి అందరికీ అనుభవంలోకొచ్చేది.
ఉద్యోగాలొచ్చాక మా అన్నదమ్ములమంతా ఊళ్ళు పట్టుకుపోయి ఆ అనుభవాన్ని కోల్పోయాం.
అయినా, నాన్నగారి మాట ప్రకారం ప్రతి ఏటా మా అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళం అంతా సకుటుంబంగా మా ఊరి అమ్మవారి జాతర కెళ్ళేవాళ్ళం. ఆ నాలుగు రోజులూ పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ, నాన్నగారి కబుర్లు వింటూ ఆనందంగా గడిపి వస్తూండేవాళ్ళం.
