-
-
భాషా వ్యాసాలు
Bhasha Vyasalu
Author: Manchi Pustakam
Publisher: Manchi Pustakam
Pages: 174Language: Telugu
ఈ పుస్తకం " 'చదువు'ల సారం" అనే శీర్షికతో వెలువడిన పుస్తకాల సిరీస్లోనిది. ఇది డిపిఇపి ద్వారా ప్రచురితమైన 'చదువు విజ్ఞానం' పత్రిక నుండి సేకరించిన వ్యాసాల సంకలనం.
* * *
పిల్లలతో మనమైనా, మనతో పిల్లలైనా, పిల్లల్లో పిల్లలైనా ఏం మాట్లాుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి అనేది మరో ప్రశ్న. దీనికొక్కటే సమాధానం. 'ఏమైనా మాట్లాడొచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు' అని! కావాల్సింది మాట్లాడం అంతే. ఇలా అంటే (చలం మాటల్లో చెప్పాలంటే) మన గుండెల మీద పెంకులు లేచి పోతున్నట్టనిపించవచ్చు.
కావల్సిందల్లా అమ్మలా పిల్లల స్థాయికి దిగి, పిల్లల ప్రపంచంలోకి దూరి, మాట్లాడడం నేర్చుకోవాలి. ఇదేమీ మనకు బ్రహ్మ విద్య కాదు. మనింట్లో మన పిల్లలతో మనం ఇలానే మాట్లాడుతుంటాం ('పురుష పుంగవుల'కా ఓపికా, తీరికా ఎక్కడిదంటే అది వేరే విషయం). పిల్లలకో భాష ఉంది. దానికో హృదయం ఉంది. దాన్ని మనం పట్టుకోవాలి. ఇదేదో కసరత్తు కానక్కరలేదు. అలా మాట్లాడ్డంలో అలాంటి మాటలు వినడంలో అద్భుతమైన అనుభూతి ఉంది. అది మనల్ని సవాలక్ష ఈతి బాధల్నించి మరిపిస్తుంది. మంచి పుస్తకం కన్నా మనసును గిలిగింతలు పెడుతుంది. నిర్మలం చేస్తుంది.
పిల్లలకి భాష నేర్పడం అటుంచండి. ముందు మనం పిల్లల భాష నేర్చుకోవాలి. పిల్లల్లానే మాట్లాడాలి. పిల్లల ప్రపంచంగానే మన బడి ఉండాలి. ఒక్కరోజు మనం మాట్లాడే పదాలన్నీ (బడిలో) రాసి పెట్టుకొన్నామనుకోండి. వాటి అర్థాలు పిల్లలకి తెలుసా అని లెక్కేసి చూసుకొన్నామనుకోండి. లేకుంటే ఒక్కరోజు మన క్లాసు పిల్లల్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి ఏం మాట్లాడుకొంటున్నారో రికార్డు చేశామనుకోండి. అందులోని పదాలన్నీ క్రోఢీకరించి, మన పదాలతో పోల్చి చూశామనుకోండి. మనకు నన్నయ భాష ఎలా ఉంటుందో పిల్లలకి మన భాషా అలానే అనిపించి ఉంటుందని అర్థం కాదూ.
మరో సంగతి, భాషకు అర్థంకావడమొక్కటే పరమార్థం కాదు. అది ఆత్మీయంగా ఉండాలి. అప్పుడే మనం ఎదుట వాళ్ళతో మమేకమవుతాం. మన హృదయాన్ని విప్పుతాం. పదాలు చాలా సామాన్యమైనవే తీసుకోండి. 'పాఠశాల, పరిసరాలు' లాంటివి సైతం ఎంత పరాయి పదాలో ఇట్టే మనకు తెలిసిపోతుంది. విచిత్రం ఏమంటే మనం కూడ ఈ పదాల్లేకుండనే ఎక్కువ విషయాలు మాట్లాడుకొంటాం. పిల్లలూ వీటికి తమవైన సొంత పదాలు ఎంచుకొనే ఉంటారు. 'మా బడికీ రోజు సెలవం'టారు కానీ 'మా పాఠశాలకు సెలవ'ని ఆంధ్రదేశంలో ఏ ఒక్క పిల్లాడైనా అంటారా? మనమైనా అంటామా?
