-
-
భారతదేశ పతనానికి పదకొండు కారణాలు
Bhaarata Desa Pathanaaniki Padakondu Kaaranaalu
Author: Dr. Avantsa Somasundar
Publisher: Kalakeli Prachuranalu
Pages: 60Language: Telugu
భారతదేశ పతనానికి పదకొండు కారణాలు (గిరీశం ఉద్ఘాటించినవి)
ఆంగ్లోపన్యాసం: కళాప్రపూర్ణ మహా నటశేఖర, బళ్ళారి టి. రాఘవ
అనువాదం: డా. ఆవంత్స సోమసుందర్
నా దృష్టిలో గిరీశం తేలిక స్వభావి కాడు. చుట్ట కాలుస్తూ తిరిగే పోరంబోకూ కాడు. చేతి బెత్తం తిప్పుకుంటూ, క్షణానికో రంగూ స్వభావమూ మారుస్తూ, తుంటరి సాహసాలు ప్రదిర్శిస్తూ, దుష్టచింతన గల దుస్సాహసికుడు కాదు. బాధ్యతారహిత ఆంధ్ర యువజన హృదయానికి గిరీశం ప్రతినిధి. జీవితపు లోలోతులకి ములిగి సామాజిక ఉపరితలానికి ఎన్నో దుఃఖపూరిత విషయాలను తెచ్చినవాడు, ఆ లోతుల నుంచి తెచ్చిన యెండ్రకాయలూ మండూకాలూ ప్రదర్శించి మన సమాజస్వరూపాన్ని ఆట పట్టిస్తాడు.
భారతదేశ పతనానికి అతను పేర్కొన్నానని చెప్పిన పదకొండు కారణాలూ నా దృష్టిలో కాల్పనికం ఎంతమాత్రం కాదు. ఆ పదకొండు కారణాలూ భారతదేశ పతనానికి మౌలిక కారణాలేనని, బాధాకర వాస్తవాలేనని భావిస్తాను. ఎంతో ఉదాత్త కళాహృదయంతో అతను మలిచిన చిత్రాన్ని వాస్తవాల పట్టికతో నింపి భంగపరచదలచలేదు. అవి ఏమిటో మనలనే
ఆలోచించుకోమన్నాడు. అతని జీవితమూ, అతని ప్రయత్నాలూ, వైఫల్యాలూ జాగ్రత్తగా పరిశీలిస్తే, మనకా పదకొండు కారణాలు తప్పక తమంతతామే వ్యక్తమవుతాయనుకుంటాను.
ఆ పదకొండు కారణాలగురించీ ఆలోచిస్తూ నేనే ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. అందుకే వాటిగురించి మరోమారు మీముందు బహిరంగంగా ఆలోచించదలిచాను.
మనమంతా గిరీశాన్ని ప్రేమిస్తాము. బహుశా అతని బలహీనతలే మనకు ఆకర్షణలేమో! అంతకన్న కారణం ఏముంది? అందుకే నాతోపాటు మీరు అతన్ని కాస్త ఉదారంగా సహించమని కోరుతున్నాను. పూనా డక్కన్ కాలేజీలో తాను లెక్చరిచ్చినట్లు గిరీశం చెప్పుకున్నాడు. ఆ పదకొండు కారణాలు వాస్తవిక దర్శనం నుంచి వచ్చినవే అని నమ్ముతాను.
వాటిని అతను పూనా డక్కన్ కాలేజీలో ఉద్ఘాటిస్తూంటే-ఆ సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్లు అవాక్కయి పోయారని గిరీశం చెప్పిన మాటలను మనం కిమ్మనకుండా విశ్వసిస్తాము. ఆ ప్రొఫెసర్లంతా గిరీశం ఉపన్యాస ప్రవాహాఘాతానికి గురయ్యారు. గిరీశం వివరించిన పదకొండు కారణాలూ దైనందిన జీవితంలో సామాన్యులకందరికి ద్యోతకమయ్యే కల్పనా సత్యాలే! వాటి వల్లనే సమాజం పతనం కావడం సత్యమేనని వారంతా భావించి ఉంటారు. సామాజిక జీవితంలో ఆ వినాశనం స్పష్టమయ్యే రీతిలో గిరీశం విశ్వసనీయంగా చెప్పివుంటాడనే మనం భావిద్దాం! సరిగ్గా నేను ఆదే సందర్భాన్ని మనసుకు తెచ్చుకొని, భారతీయ పతన జీవితం గురించి మీముందు ఆలోచించ నారంభించాను.
- బళ్ళారి రాఘవ
