-
-
బసవరాజు అప్పారావు గీతములు
Basavaraju Apparao Geetamulu
Author: Basavaraju Apparao
Publisher: BPMD Publications
Pages: 263Language: Telugu
"ఏ దేశమేగినా ఎందుకాలిడిన
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"
అన్న మాటలు వింటే గుర్తొచ్చేది రాయప్రోలు సుబ్బారావు గారు
"సౌరభములేల చిమ్ము పుష్ప వ్రజంబు
చంద్రికల నేల వెదజల్లు చందమామ
ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను"
ఈ కవిత్వ గుబాళింపు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని గుర్తుచేస్తుంది.
"కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది
దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కూకుండ నీదురా కూసింతసేపు"
అంటూ ఎంకి ఊసులు చెప్పే నాయుడు బావ గుర్తుచేసేది నండూరి సుబ్బారావు గారిని.
ఇలా సుమారు 100 సంవత్సరాల కాలం క్రితమే భావకవితానాదం చేయడం మొదలుపెట్టారు ఈ కవులంతా.
అలా అప్పటి తెలుగు భావకవితా కాలంలో ఉజ్వలంగా వెలిగిన మరో కవి, కవితారవి శ్రీ బసవరాజు అప్పారావు గారు.
"కొల్లాయి గట్టితే నేమీ,
మాగాంధి
కోమటై పుట్టితే నేమీ?"
అన్న బసవరాజు అప్పారావు గారి ప్రసిద్ధ గీతం అప్పట్లో ఎందరో దేశభక్తులను ఉర్రూతలూగించిది.
"గుత్తొంకాయ్ కూరోయ్ బావా!
కోరి వండినానోయ్ బావా!
కూరలోపలా నా వలపంతా
కూరిపెట్టినానోయ్ బావా!"
అంటూ ప్రేమనంతా రంగరించి పోసిన 'వెఱ్ఱిపిల్ల' పాట ప్రేమజీవుల హృదయాలను పరవశింపజేసింది.
"నాగులచవితికి నాగేంద్రా! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రీ!"
అనే నాగులచవితి పాట అమ్మల, అమ్మమ్మల నోళ్ళలో ఆయనకు చిరస్థాయిత్వం ఇచ్చింది..
బసవరాజు అప్పారావుగారు మరణించి 85 సంవత్సరాలవుతున్నా ఆయన పాటలు ఎన్నో ఇంకా మన చెవుల్లో మ్రోగుతూనే ఉన్నాయి.
కావ్యపానము జేసి
కైపెక్కినానే!
దివ్యలోకాలన్ని
తిరిగొచ్చినానే!
అంటూ పాఠకులకు కైపెక్కించి భావలోకంలో మనల్ని విహరింపజేయించి
"ఎద మెత్త నౌటకై
సొదగుందరా అంత
మది గల యహమ్మంత
వదలిపోవునురా"
అంటూ "ప్రేమ తత్త్వము" విశదపరచి
"ఏ మని పాడితివో
గోపాలకృష్ణా ఏమని పాడితివో?
భామలు పదియారు వేలు
పరవశలై సొక్కి సోల"
అంటూ కృష్ణగానామృత పానం చేయించిన బసవరాజు అప్పారావు గారిని మరోమారు స్మరించుకుంటూ వారి కవితాంబుధిలో ఓలలాడడానికి స్వాగతం పలుకుతున్నాం.
- బి.పి.ఎమ్.డి.పబ్లికేషన్స్
