-
-
బంకోలా
Bankola
Author: sadhu subrahmanyam sarma
Publisher: Self Published on Kinige
Pages: 330Language: Telugu
పరిచయాలు, ముందు మాటలు - ఇతరులు రాసేవి - కొన్ని పుస్తకాలకు అవసరముండదు. స్వయం ప్రకాశకాలయిన రచనలకు అద్దం పట్టడం దేనికి? అటువంటి వాటిల్లో ‘‘బంకోలా’’ ఒకటి.
పేరు కొత్తగా ఉన్నది. రాసిన రీతి మార్పుగా వుంది. ఇది ఒక కథ పెద్దదయిన కథ. నవల అనుకున్నా నాకు ఆభ్యంతరం లేదు. అయితే కధ చెప్పిన వైనంలో ఒక ప్రత్యేకత వుంది. అనగనగా ఒక ఊరు అంటూ మొదలు పెట్టిన కథనం కాదు. కొంత మంది కాలేజీ అబ్బాయిలు దేశాన్ని చూడ్డానికి వెళ్తారు. వాళ్ళు తెలుగు పిల్ల్లలు. తెలుగువాళ్ళకి, అదిలాబాదులో వున్నా, కోటిపల్లిలో వున్నా, గోదావరి పంచప్రాణాల్లో ఒకటి. అందుచేత ఈ తెలుగు అబ్బాయిలు గోదావరి వైపుకే పయనం సాగిస్తారు. గోదావరి అనగానే అందులో పయనించే పడవలూ, పడవ వాళ్ళు వుండ కుండా వుండడానికి వీలులేదు. గోదావరీ జలాల ప్రభావము అనుకుంటాను, దానిమీద పడవలు నడిపే వారికందరికి మాట, పాట గోదావరి పొంగులాగానే ఉరికి వస్తూ వుంటాయి. అటువంటి పడవ వాడు ఒకడు ఈ అబ్బాయిలకు తగిలాడు. పదాల పాడి వినిపించాడు. అందుకు రుచి మరిగి కథ గూడా చెప్పమన్నారు అతగాడిని ఈ పిల్లలు. ఆ నావ మీదే అ నావికుడే బంకోలా కథను చెప్పాడు. ఈ మాదిరిగా కథ ఎత్తుగడలో కొత్తదనం ఉంది.
తరువాత కథా ప్రదేశం తెలుగు దేశములోని సాగరసీమ కాగా, కధా కాలం 18 వ శతాబ్ధం . ఆ ప్రాంతపు ఆ నాటి తెలుగు వాళ్ళ జీవితం, చరిత్ర , సంస్కారం, సంస్కృతి, నాగరికత ఇవన్ని యిందులో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి కథ చదువుతూ వుంటే అ నాటి తెలుగు జీవితాన్ని అంది పుచ్చుకున్నట్టు లేక అద్దంలో చూచినట్టు, మనకు అనుభూతి కలుగుతుంది. పాఠకుణ్ణి తాను నిర్మించిన వాతవరణంలోకి, అనుభూతులలోకి తీసుకువెళ్ళగలగడం అందులో అతని మనస్సును లగ్నము చేయగలగడం శర్మగారి రచనా నైపుణ్యాన్ని రుజువు చేస్తాయి.
ఎంతగానో నాకు నచ్చిన విషయం మరొకటి వుంది. అది పుస్తకములోని భాష. కమ్మగా, హయిగా, మనం మాట్లాడుకుంటున్నట్లుగా వుంది. ఆదినుండి తుది వరకు ఆ శైలిని నిటబెట్టడం శర్మగారికి భాష మీద వున్న అధికారాన్ని సూచిస్తుంది.
పుస్తకము చదివేక ఒక తృప్తి, ఒక హయి నాకు కలిగాయి. మంచి కథ పసందయిన కథనం, నాజూకైనా భాషకలిసి ఒక మంచి పుస్తకాన్ని చదివాననే అనుభూతిని కలిగించాయి. ఆ అనుభూతిని తెలియజేయడానికే యీ నాలుగు మాటలు రాసాను.
- ఆవుల సాంబశివరావు
