-
-
ఆత్మకురు కైఫియతు
Atmakuru Kaifiyatu
Author: sivuni chandra sekhar reddy
Publisher: Self Published on Kinige
Pages: 143Language: Telugu
శివుని చంద్రశేఖర్ రెడ్డి రాసిన "ఆత్మకూరు కైఫియతు" (ఆత్మకూరు గ్రామ చరిత్ర) జైనుల నుంచి (క్రీ.పూ) నేటి వరకు సాగిన 2000 సంవత్సరాల ఆత్మకూరు మహా ప్రస్థానాన్ని ఆవిష్కరించింది.
ఆత్కూరు, ఆతుకూరుగా శాశనాలకెక్కిన ఆత్మకూరు వయసెంత?
ఆత్మకూరులో కట్టిన తొలి దేవాలయం ఏది? ఎక్కడ? ఎవరు?
9 వ శతాబ్దంలో నిర్మించిన విశ్వనాథ ఆలయం ఏమైనది?
ఆత్మకూరు చెరువు పేరు ఏమిటి?
చెరువు నిర్మాత మహామంత్రి తిమ్మరుసు కానే కాదా?
ఊరు తొలిసారిగా విన్న ఆజా ఎవరు - ఎప్పుడు - ఎక్కడ చేసారు?
పెద్ద మసీదు నిర్మాణ విశేషాలు ఏమిటి?
ఆసార్ అంటే విశేష అర్థం ఏమిటి?
అడుగుపెట్టిన తొలి క్రిస్టియన్ ఎవరు?
తొలి స్థానిక క్రిస్టియన్ ఎవరు? ఆయన ఎదుర్కొన్న సమస్యలేమిటి?
అలఘనాధ ఆలయం ఊరి చివర ఎందుకు వుంది?
పడమర దిక్కుకు అభిముఖంగా ఉండడంలోని ఆంతర్యం ఏమిటి?
తొలి గోడ పత్రిక, తొలి ఊరి బావి, తొలి పోలీస్ స్టేషను ఆనవాళ్ళు ఎక్కడ?
మరెన్నో ప్రశ్నలకు విశ్లేషణల సమాహారం "ఆత్మకూరు కైఫియతు".
లుప్తమైన మన పూర్వీకుల వివరాలు, శిధిలమవబోతున్న మన వుమ్మడి చారిత్రక వారసత్వ సంపదకు డాక్యుమెంటరీ ఇన్స్క్రిప్షన్ "ఆత్మకూరు కైఫియతు".
హిందీ, ఉర్దూలకన్నా, తెలుగు లిపి కన్నా, క్రీస్తు కన్నా ముందు పుట్టిన ఆత్మకూరి మహా ప్రస్తాపన "ఆత్మకూరు కైఫియతు".
* * *
దేశ చరిత్రలు
బలవంతుల బోగట్టా
గ్రామచరితలు
మానవత్వం
పరిమళించే
కాలిబాటల
సంచారాలు
మీకే
చరితలు కావాలి?
* * *
సాహితిమిత్రులు విజయవాడ వారు, గ్రామ చరిత్రలకు ఇది ఒక model గా , reference గా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
* * *
An Associate Professor at SVU college of science opined that the book formed very interesting and rare information about Atmakur.
గమనిక: "ఆత్మకూరు కైఫియతు" ఈ-బుక్ సైజు 8.12 MB
స్ఫూర్తిదాయక స్థానిక చరిత్ర-ఆత్మకూరు కైఫియతు
-ద్వా.నా.శాస్ర్తీ
05/10/2013
కైఫియత్ అనగానే ఆంగ్లేయు డైన కల్నల్ మెకంజీ గుర్తుకు రావాల్సిందే. ఆనాడే స్థానిక చరిత్రలు రాయించి తెలుగు వారి చరిత్ర కొంత భద్రపరిచిన మహానుభావుడాయన. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. స్థానిక చరిత్రను భద్రపరిచిన నాడే తెలుగు వారి సమగ్ర చరిత్రకి మార్గం సుగమం అవుతుంది. ఈ ఎరుక ఉన్న చంద్రశేఖరరెడ్డి రాసిన విశిష్ట గ్రంథం ‘ఆత్మకూరు కైఫియతు’. కైఫియత్ అంటే స్థానిక చరిత్ర. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఊరి చరిత్ర ఈ గ్రంథం. అయితే చరిత్ర కవిత్వం కాదు-వాస్తవికత ఉండాలి. దానికి సాక్ష్యాధారాలు కావాలి. బోలెడంత ఓర్పుండాలి. సరైన లక్ష్యం ఉన్నప్పుడు అన్నీ అవే వస్తాయని ఈ పుస్తకం ద్వారా చంద్రశేఖరరెడ్డి చాటి చెప్పారు.
ఆత్మకూరు ఎప్పటినుంచి ఉంది? ఎలా పుట్టింది? ఎలా పెరిగింది? దానికి ఏవి ఉత్ప్రేరకాలయ్యాయి? ఎవరు కారకులు? పూర్వం ఒక గిరిజన గూడెంగా ఉన్న ఊరు ఇవాళ పెద్ద మునిసిపాలిటీగా, ముఖ్యమైన పట్టణంగా ఎలా అభివృద్ధి చెందిందో ఈ పుస్తకం వివరిస్తుంది. విషయాన్ని వెల్లడించడంలో కొత్త అభివ్యక్తి కనిపిస్తుంది.
నాలుగు ‘యుటర్న్లు’ ఆత్మకూరు చరిత్రకి మూల కారణాలుగా చెప్పుకు వచ్చారు. మొట్టమొదట ఈ ప్రాంత నివాసులు బౌద్ధులనీ ఆ తర్వాత జైనులు వచ్చారని తెలిపారు. జైనుల కాలంలోనే ఊళ్ల పేర్లు వచ్చి ఉంటాయని తెలుపుతూ జైన ధార్మిక జనావాసాలకు మధ్యలో ఉండడం వల్ల ‘ఆత్మకూరు’ అనే పేరు వచ్చి వుంటుందని తెలుపుతూ గ్రామ నామాల వివరణలు ఇచ్చారు. విజయనగర సామ్రాజ్యాధీశుల వల్ల ఆత్మకూరు చరిత్ర రెండవ ‘యుటర్న్’ తీసుకుందనీ మూడవ ‘యుటర్న్’ బ్రిటిష్ వారివల్ల జరిగిందనీ చెప్పుకువచ్చారు.
‘పోలిటి కాలిటీ’, ‘ఎడ్యున్’, ‘్ధర్మికత’, ‘ఇస్లాము’ మొదలైన శీర్షికలతో ఎంతో సమాచారమిచ్చారు. ‘పూర్వం పుస్తకాలు పలకలు లేవు-గోడపై రాస్తే పిల్లలు నేలపైనున్న ఇసుకలో రాసేవారు. ఇసుకలో రాసిన అక్షరాలను చూపుడు వేలుతో దిద్దించేవారు. దిద్ది దిద్ది నా వేలు పుండు అయింది అని మా అమ్మమ్మ చెప్తూ ఉండేది’’ వంటి విశేషాలు తెలుసుకుంటాం. పచ్చి టమాటాలు పచ్చి వంకాయలలాగ వుంటాయి కాబట్టి నాటు వంకాయలు అనే నానుడి వుండేది. ‘జొన్న’ గురించి మంచి సమాచారమిచ్చారు. అంతేకాదు-పెద్దిరెడ్డి కోటారెడ్డి ఈ ప్రాంతపు తొలి కవిగా, దోర్నాదుల సుబ్బమ్మ తొలి రచయిత్రిగా పేర్కొన్నారు. అలా తొలి పిండిమిల్లు, తొలి నీటి మోటారు, తొలి డ్రైవరు, తొలి బస్టాండ్ అంటూ గత చరిత్రను తవ్విపోసారు. మరి నేటి కవుల్ని, రచయితల్ని ఎందువల్ల పేర్కొనలేదో!
ఇక నాల్గవ ‘యుటర్న్’ ఇచ్చినవారు రాష్ట్ర ఆర్థిక శాఖా మాత్యులు ఆనం నారాయణరెడ్డి గారని తెలిపారు. ఈయన హయాంలో జరిగిన అభివృద్ధిని రచయిత వివరించారు. మ ళ్లీ ఇటువంటి ‘యుటర్న్లు’ 2060, 2075, 2090లలో జరుగుతాయని సంఖ్యా శాస్త్రం ప్రకారం అంచనా వేశారు. కొంత ప్రాంతీయాభిమానం కనిపిస్తున్నా ఆత్మకూరు వారికే తెలియని వింతలు, వార్తలు చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రయత్న చేయడానికి గల శక్తియుక్తులు ఇంజనీర్ అయిన చంద్రశేఖరరెడ్డి గారికి ఉన్నాయి. ఇతర ఊళ్ల చరిత్రలు రాయడానికి గ్రంథం మార్గనిర్దేశనం చేస్తుంది. చంద్రశేఖరరెడ్డిగారు మరిన్ని కైఫియతులు వెలువరిస్తారని ఆశిద్దాం.
THE HINDU-
BOOK REVIEW ON 19-10-2013