-
-
ఆత్మజ్ఞానము
Atma Gnanamu
Author: Bhamidipati Balatripurasundari
Publisher: Sree Shanmukheswari Prachuranalu
Pages: 214Language: Telugu
“అహం బ్రహ్మాస్మి” అనేది జ్ఞానులు చెప్పే విషయం. మనం ప్రతిరోజు అనేక మంది సద్గురువులు, గొప్ప పండితులు భగవద్భక్తులు చెప్పగా ఈ మాటని వింటూనే ఉంటాము.
మనం దీనివల్ల అర్థం చేసుకోవలసింది ఏమిటంటే "నేను కూడా పరబ్రహ్మనే" అని. అలా అందరూ అనుకున్నప్పుడు అందరూ పరబ్రహ్మలే కదా! నేను పరమాత్మని కనుక కదలకుండా రాయిలా కూర్చుంటాను. నాకు సేవలు చెయ్యండి అని అంటే. అందరూ కూర్చునే ఉంటారు.
పరమాత్మని కాబట్టి అందరూ నన్ను పూజించండి, నన్ను స్తోత్రం చెయ్యండి, నాకు నైవేద్యాలు పెట్టండి అని అడిగేవాళ్లు లేకపోలేదు. ముందుగా మనకి వచ్చే ఆలోచన అదే! కాని, ఇక్కడ అది కాదు అర్థం. అందరూ పరబ్రహ్మలే కనుక అందరూ అందర్నీ గౌరవించుకోవాలి. ఎవర్నీ ఎవరూ ద్వేషించకూడదు. ఒకళ్లకి ఒకళ్లు సహాయం చేసుకోవాలి. వివేకం లేక తప్పులు చేసేవాళ్లకి వివేకవంతులు మంచి చెడులు తెలియ చెప్పాలి. వివేకం లేనివాళ్లు వివేకవంతులు చెప్పినదాన్ని విని ఆచరించాలి.
ప్రతి మనిషి పరమాత్మే అని కాదు అర్థం. ప్రతి జీవీ పరమాతే! ఎందుకంటే ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మ భగవంతుడి నుంచి వచ్చినదే. శరీరం ఆత్మ కాదు. ఆత్మ శరీరంలో ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని సాధనంగా ఉపయోగించుకుని పూర్వజన్మ కర్మలవల్ల పొందిన పాపాల్ని సమూలంగా పోగొట్టుకోవాలి. ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది కనుక మళ్లీ దాన్ని పరమాత్మలో లీనం చెయ్యడానికి ప్రయత్నించాలి.
దీన్నే జన్మరాహిత్యం అంటారు. జన్మే లేకుండా చేసుకునే శక్తి లేకపోయినా కనీసం తిరిగి పొందబోయే జన్మలో మంచి మనిషిగా, ఆరోగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, జ్ఞానిగా పుట్టి ఆ జన్మలో అయినా మోక్షానికి ప్రయత్నించవచ్చు. మనం చేసిన కర్మలవల్ల అసలు మనిషి జన్మే పొందకపోతే చెయ్యగలిగింది ఏదీ లేదు.
జీవుడు తన ఆత్మని పరమాత్మలో లీనం చేసి మోక్షాన్ని పొందడంకోసం ఎక్కువ కష్టపడక్కరలేదు. చిన్నప్పటి నుంచి భగవంతుడి యందు భక్తిభావాన్ని పెంచుకుంటే అది జీవితం చివరివరకు నిలుస్తుంది. కలియుగంలో మోక్షానికి భగవంతుడే సూక్ష్మ మార్గం చెప్పాడు. కష్టం లేకుండా, ఖర్చు లేకుండా ఏ పనీ ఆపకుండా మనస్సులో భగవన్నామం చేసుకుంటూ తననే స్మరించే భక్తుడికి కావలసినవన్నీ భగవంతుడే సమకూరుస్తాడు.మోక్షానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవి 'ఆత్మజ్ఞానము' అనే ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో... శ్లోకాలతో, మహర్షులతో, జ్ఞానులతో, భక్తులతో, పండితులతో, దేవతలతో, రాక్షసులతో, భగవంతుడితో కూడా కథలుగా చెప్పబడ్డాయి. ఈ మార్గాల్లో మనకు ఏది సులభమైన మార్గమో ఎంచుకుని భగవద్భక్తిని పెంచుకుని మోక్షాన్ని ప్రసాదించమని భగవంతుడిని వేడుకుందాము.
- భమిడిపాటి బాలాత్రిపురసుందరి
