-
-
అతిథి
Atithi
Author: Athaluri Vijayalakshmi
Pages: 143Language: Telugu
"అదేంటే మీ ఆయన్ని మాట్లాడనివ్వవా ఏంటి అన్ని నువ్వే చెబుతున్నావ్ .. "
విమల నవ్వుతూ అంది .. "చెప్పాగా .. చాలా కొత్త ఆయనకి .. నీకో సంగతి తెలుసా .. ఆయన కెమిస్ట్రీలో పి.హెచ్.డి చేశారు.. బైట నేమ్ ప్లేట్ చూశావో లేదో డాక్టర్ రాజశేఖర్ అని ఉంటుంది .. టాక్టిక్స్ లేక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రమోషన్ పోగొట్టుకున్నారు.."
"అరరే అలాగా .. ఇలా ఉంటే కష్టం సార్ .. బైదిబై .. నాకేం అవుతారు విమలా .."
"ఏం అవడం ఏంటి? మీ అమెరికా వాళ్ళకి వరసలు తెలియవా? నా మేనత్త కూతురువి.. నీకు నేను వదిన తను అన్నయ్య.. "
శేఖర్ చేతులు సన్నగా వణికాయి.. విమలవైపు చూడాలనుకున్నాడు కానీ, మనస్కరించలేదు.. మలయ వైపు కూడా.. ఆమె మోహంలో భావాలు చూడాలనుకున్నాడు.. కానీ ధైర్యం సరిపోలేదు.
విమల తలవంచుకుని ఇడ్లి తింటోంది.
శేఖర్కి త్వరత్వరగా అక్కడినుంచి వెళ్లిపోవాలనిపించింది ..
ఈమె పేరు .. మలయా? ..కాదు , కాదు.. ఈమె .. ఆమెలాగే ఉంది.. పరిశీలనగా చూడాలి..
మలయ వైపు మరోసారి చూడాలంటే భయం వేస్తోంది.. కానీ, ఈమె ఖచ్చితంగా ఆమే అనిపిస్తోంది..
ఏదో మార్పు కనిపిస్తోంది. ఏంటా మార్పు? వయసు పెరిగినందుకా? లేక పచ్చటి రంగు, గులాబీరంగులోకి మారినందుకా? ఏదో మార్పు.. కళ్ళదాలు తీస్తే ఆ కళ్ళు చూసి తెలుసుకోవచ్చు ఆమేనా? ఎలా వచ్చింది ఇన్నేళ్ళ తరవాత .. విమల బంధువుగా ఇక్కడికి రావడం ఏంటి? ఈ వరసలేంటి? తనని గుర్తుపట్టలేదా? ఆమె మారింది కానీ, గుర్తు పట్టనంత మార్పు తనలో లేదు.. గుర్తు పట్టి ఉంటుంది .. కానీ, పట్టనట్టు నటిస్తోంది .. ఈమెకి తను విమల భర్త అని తెలుసా ..
