-
-
అపరాజిత
Aparajita
Author: Saleem
Publisher: Shaili Publications
Pages: 55Language: Telugu
రజిత మధ్యాహ్న భోజనం తర్వాత హారిక వస్తుందని ఎదురుచూసింది. సాయంత్రం ఐదు దాటినా ఆ అమ్మాయి రాకపోతే తనే వాళ్ళింటికి వెళ్ళి “హారిక వచ్చిందా ఆంటీ” అని వాళ్ళమ్మని అడిగింది.
"లేదమ్మా, నేనూ దానికోసమే ఎదురుచూస్తున్నా. పన్నెండు లోపల వచ్చేస్తానని వెళ్ళింది. బహుశా పద్మజ బలవంతం చేస్తే అక్కడే తినేసి, కబుర్లాడుకుంటూ ఉండిపోయిందేమో. స్నేహితురాళ్ళతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు దానికి” అంటూ నవ్విందామె.
“నాతో కూడా తొందరగా వచ్చేస్తాననే చెప్పిందాంటీ. తను వస్తే ఒకసారి మా యింటికి పంపరా” అంది రజిత.
“సరేనమ్మా. రాగానే నువ్వొచ్చి పోయావని చెప్తాలే” అంది హారిక వాళ్ళమ్మ.
స్కూల్ నుంచి హారిక వాళ్ళ నాన్న వచ్చేశాడు. అరయింది. ఏడయింది. అతన్లో కంగారు మొదలయింది.
“మీరు పద్మజ వాళ్ళింటికెళ్ళి అమ్మాయిని పీల్చుకు రండి” అంది హారిక వాళ్ళమ్మ.
ఇంట్లో కూచుని కూతురు రాలేదేమని ఎదురుచూడటం కన్నా వెళ్ళి పిల్చుకురావడమే మంచిదనుకున్నాడు. "ఈ కాలం పిల్లలు పెట్టే మానసిక వత్తిడికి బీపీలు రావడం ఖాయం” అని భార్యతో అనేసి పద్మజ వాళ్ళింటికి బయల్దేరాడు.
తలుపు తీసి “ఏంటంకుల్” అని అడిగిన పద్మజతో “మా అమ్మాయిని పిలువమ్మా బాగా చీకటి పడిపోయింది కదా. పిల్చుకెళ్దామని వచ్చాను” అన్నాడు.
“హారిక ఇంటికి రాలేదా? అదేంటంకుల్.. నేను ఉండమని బతిమాలినా ఉండకుండా మధ్యాహ్నం ఒంటిగంటకే వెళ్ళిపోయిందిగా” అంది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ.
అతను భృకుటి ముడివేసి “ఒంటిగంటకే వెళ్ళిపోయిందా? మరి ఇప్పటివరకు రాలేదే. ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటుందా?” అన్నాడు.
పద్మజ కొన్ని క్షణాలు అలోచించి మరో ఇద్దరు స్నేహితురాళ్ళ పేర్లు చెప్పి " వాళ్ళతో కూడా బాగా క్లోజ్ గా ఉంటుందంకుల్. బహుశా వాళ్ళిళ్ళకేమైనా వెళ్ళిందేమో కనుక్కోండి” అంది.
“ఒకవేళ వెళ్ళినా మా అమ్మాయి ఎప్పుడూ చీకటి పడేవరకు ఎవరింట్లోనూ ఉండదమ్మా” అన్నాడు. అయినా వెళ్ళి కనుక్కోవడం మంచిదని వాళ్ళిళ్ళకు వెళ్ళి వాకబు చేశాడు. హారిక అసలు ఆ వైపుకే రాలేదని చెప్పారు.
ఇప్పుడతనికి కంగారు స్థానంలో భయం వేయడం మొదలైంది. ఇంటికి తిరిగొచ్చి చుట్టుపక్కల ఉన్న నలుగురు మగవాళ్ళని తోడు తీసుకుని వూరంతా వెదికినా హారిక జాడ తెలియలేదు. రాత్రి తొమ్మిది వరకు వెదికి ఇక లాభం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108