-
-
ఆపద్బాంధవి ఉరఫ్ పాపాలభైరవి
Apadbandhavi Uraf Papalabhairavi
Author: Gabbita Krishna Mohan
Publisher: Self Published on Kinige
Pages: 147Language: Telugu
శేషయ్య వెళ్ళిన తరవాత ఆవరించిన నిశ్శబ్దాన్ని ముందుగా కామాక్షీదేవే ఛేదించింది.
‘బావుంది, భేషుగ్గా వుంది,’ అందావిడ.
లలితకి వూపిరి సలపనట్టయి మాట్లాడలేకుండా వుంది. శేషయ్య చెప్పిన విషయం – రత్నమాల పిన్ని హీరోయిన్గా వున్న గొప్ప బాక్సాఫీస్ హిట్ పిక్చర్లో సౌజన్యమూర్తులైన అమాయక స్త్రీలని బలిష్టమైన మొగాళ్ళు వెంబడిస్తుండటం గుర్తుకు తెచ్చింది. రవికుమార్కి మొండి పట్టుదల వుందని ముందే గ్రహించింది కాని, ఆ మొండి పట్టుదల యింతదూరం తీసుకొస్తుందనుకోలేదు. ఎంతో చిరపరిచితులైనా, గడ్డాలు, మీసాలు పెంచుకున్న హింసాత్మకులైనా, చేతిలో చిల్లిగవ్వలేని రంగయ్యనాయుడు పిలవగానే రత్నమాలాదేవి యింటికి రారు. అంతేకాదు – పెట్టె, బేడా తీసుకొచ్చి ఆమె యింట్లో తిష్ట వెయ్యటానికి వెనకాడుతారు.
‘బావుంది, మహా భేషుగ్గా వుంది,’ అంది కామాక్షీదేవి. ‘రంగడుబావకి అతిథి సత్కారాలు చాలా ఎక్కువ. ఆ విషయంలో రంతిదేవుడిని మించుతాడు.’
‘మతి కాస్తా పోయుంటుంది బాబాయికి. ఎవరిని బడితే వాళ్ళని యింటికి పిలవకూడదు. ఇది ఆయన యిల్లు కాదు.’
‘ఇప్పుడు రత్నమాల కూడా ఆమాటే అంటుందతన్తో.’
ఈ గుంభనలో వున్న యింకొక కోణం లలిత దృష్టిలోకి యిప్పుడే వచ్చింది.
‘బాబాయి నిన్న రాత్రి రవికుమార్‌తో గడిపాడని శేషయ్య చెప్పడంలో అర్థమేమిటి? ఆయనసలు బయటికి అడుగే వెయ్యడుగా. ఆయనే చెప్పారీ సంగతి.’
‘నిన్న మాత్రం వెళ్ళాడు. కాస్తంత అల్లరి చెయ్యడానికెళ్ళాడు.’
‘ఓ అందుకేనా రాత్రి భోజనాలప్పుడు ఆయనెక్కడా కనిపించలేదు. తలనొస్తోందేమో అనుకున్నా.’
‘ఇప్పుడైతే అదే అయుంటుందిలే.’
లలితకి మహా ఆందోళనగా వుంది. ఆమెకి బాబాయంటే చాలా యిష్టం. ముందుచూపు లేకుండా ఆయన చూపించిన కలుపుగోలుతనానికి పర్యవసానం తలుచుకుంటే ఆమె లేతహృదయం ద్రవించింది.
