-
-
అన్ని రూపాలూ రూపాయే...
Anni Rupalu Rupaye
Author: G.S. Lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 98Language: Telugu
ఈ సంపుటిలో శ్రీమతి జి.ఎస్. లక్ష్మిగారు అందిస్తున్న కథలు చదువుతూ ఉంటే పాఠకులకు ఒక షడ్రసోపేతమైన విందుభోజనం ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది అంటే అది ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. హాస్యం, వ్యంగ్యం వంటి గిలిగింతలు పెట్టే సన్నివేశాలతో పాటు, వొళ్ళుగగుర్పొడిచే బీభత్సము, కంటతడిపెట్టించే కరుణ, అబ్బురంగొలిపే తెలివితో కూడిన ధైర్యస్థైర్యాలు - ఇలా నవరసభరితంగా, ఒక సంపూర్ణమైన కావ్యాన్ని చదివిన అనుభూతి పాఠకులకి కలిగిస్తాయి ఈ సంపుటిలోని కథలు.
రచయిత్రికి తెలుగుభాష మీద ఉన్న మంచిపట్టు, మంచిసాహిత్యాన్ని చదివి ఉండడంవల్లనూ, సంతతం ఎందరో మంచి రచయిత్రులతో స్నేహసంబంధాలు నెరపుతూ ఉండడంవల్లనూ కావచ్చు, పాఠకులను ఇబ్బంది పెట్టకుండా హాయిగా చదివించే వాక్యం లక్ష్మిగారిది. కథానిర్మాణంలో కూడా నిరాడంబరమైన శైలి, అనవసరపు ఆర్భాటాలు, అట్టహాసాలు లేకుండా. అటుపైన అపారమైన జీవితానుభవానికి తోడు చుట్టూ ఉన్న సమాజాన్నీ, మనుషుల్నీ నిశితంగా పరిశీలించే చూపు లక్ష్మిగారి స్వంతం. ఐతే చూసింది చూసినట్టు అక్షరాల్లోకి దింపెయ్యకుండా - సుమతీశతక కారుడు చెప్పినట్టు - వేగ పడక వివరింపదగున్ - అన్నట్టు, చూసిన విషయాలని లోలోపల మధించి, సమాజానికి హితం చెప్పే మంచిని నవనీతంలా తన కథలలో పొందుపరిచారు.
మన మధ్యతరగతి కుటుంబ నేపథ్యం ఈ సంపుటిలోని చాలా కథలకి యవనిక. ఈ మనోభావాలు, ఆవేశాలు, బాధ్యతలు, ఆప్యాయతలు, సంకోచాలు - ఇవన్నీ ఒక బలమైన మోకులాగా పేనబడి, ఈ కథలకి అంతస్సూత్రంగా పట్టి ఉంచుతున్నాయి. ఐతే, కొన్ని కథల్లో రచయిత్రి చాలా బలంగా చిత్రించిన గృహహింస, ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలని - ఆమెభార్యకావచ్చు, కూతురుకావచ్చు - ఆ యింటి యజమాని అయిన పురుషుడు హింసించడం (అనుబంధాలు కథ) చదివి నేను కొంత నిర్ఘాంతపోయిన మాట నిజం. ఇటీవలికాలంలో ఇలాంటి సందర్భాల చిత్రీకరణ సాహిత్యంలో ఎదురైనప్పుడు ఒక ఉద్యమిస్తున్న ఫెమినిస్ట్ ఆర్భాటం ఎక్కువగా వినిపిస్తూ ఉన్న వాతావరణ నేపథ్యంలో లక్ష్మిగారు చాలా సూటిగా ఈ కథలు చెప్పడం పాఠకులను తట్టిలేపుతుంది.
అక్కడక్కడా, కొన్ని కథల్లో (ఉదా. బంధాలు - బాధ్యతలు, టిట్ఫర్టాట్) రచయిత్రి ప్రకటించిన భావాలు, ఎత్తిచూపిన విలువలు నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించాయి. ఇంకా భారతీయ సమాజంలో ఇటువంటి భావాలకి ప్రవర్తనలకీ స్థానం ఉందా? ఇటువంటి విలువలకి కాలం చెల్లలేదూ అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. ఐతే, నిజాయితీగా బతకడం, చదువుకి పెద్దపీట వెయ్యడం వంటి చిత్రీకరణలు నాకు బాగా నచ్చాయి. చాలా కథల్లో ముఖ్యపాత్ర ఒక సాత్వికమైన శక్తితో ఎదురైన సమస్యని అధిగమించినట్లుగా చిత్రించడం కూడా నాకు బాగా నచ్చింది.
తాజాతాజా పెళ్ళిబాజాలు అనే కథ గురించి ఇక్కడ కొంచెం ముచ్చటించాలి. పెళ్ళిళ్ళలో వెర్రితలలు వేస్తున్న ఏవెంట్మేనేజర్ ఆర్భాటాల మీద కొంచెం వ్యంగ్యంగా, కొంచెం హాస్యంగా ఈ కథని రాశారని అనుకుంటున్నాను. నేనిక్కడ అమెరికాలో మాఊరిలో నిస్థానిక హిందూ దేవాలయంలో ఔట్రీచ్ డైరెక్టర్గా చాలా ఏళ్ళుగా స్వఛ్ఛంద సేవ చేస్తున్నాను. ఈ పనిలో భాగంగా హిందువులు కాని వారిని హిందువులు వివాహం చేసుకున్న సందర్భాలలో రెండు మతాల పద్ధతులతోనూ పెళ్ళి జరిపించడం నాకు స్వయంగా అనుభవమే. ఇక్కడి సమాజంలో ఇటువంటి పరిస్థితి సర్వసాధారణం కాకపోయి నాకొంత తరచుగా కనిపిస్తూనే ఉంది. ఎవరి సాంప్రదాయాలు వారికి ప్రియమే, వాటిని సాధ్యమైనంత వరకూ నిలబెట్టు కోవాలి, కాపాడుకోవాలి కూడాను. కానీ అదే సమయంలో, విదేశ నివాసానికి సిద్ధపడిన తరువాత, మనవి కాని సాంప్రదాయాల పట్ల గౌరవం కలిగి ఉండడం కూడా అవసరమని నేను భావిస్తాను.
ఈ సంపుటిలో నిజంగా గుర్తించవలసిన కథ వారధి. అమ్మాయికి పెళ్ళి ద్వారా అబ్బే బాధ్యతని ఈ కథలో చాలా చక్కగా చెప్పారు. ఇటీవలికాలంలో ముఖ్యంగా అమ్మాయిల హక్కుల గురించి చాలా కథలు వచ్చాయి, పెళ్ళయ్యాక ఎన్ని కష్టాలుపడుతున్నారో, ఎన్ని త్యాగాలు చెయ్యాల్సి వస్తోందో విశదీకరిస్తూ. నిజానికి అక్కడ కావలసినది ఒక పది గ్రాములు ఇంగితజ్ఞానం, ఒక పది మిల్లీల ఔచిత్యం. ఆ పాఠాన్ని అన్నపూర్ణ సహజంగా నేర్చుకుని తనలోనే ఒక అంతర్గత భాగం చేసేసుకుంది. అది ఇప్పుడు కూతురు సుమ పెళ్ళిసందర్భం వచ్చినప్పుడు సోదాహరణంగా చెప్పక తప్పలేదు.
చక్కని భాషతో, సూటి అయిన కథనంతో, మానవతకీ, మంచి విలువలకీ పెద్దపీట వేస్తూ ఈ కథలు రాసిన రచయిత్రికి అభినందనా పూర్వకంగా నమస్కరిస్తున్నాను.
- శంకగిరి నారాయణస్వామి
