-
-
ఆంధ్ర శాసనాలు - సాహిత్యంలో ప్రతిఫలించే దేవదాసీ వ్యవస్థ
Andhra Sasanalu Sahityamlo Pratiphalinche Devadasi Vyavastha
Author: Nalubolu Rama Gopal Reddy
Pages: 106Language: Telugu
దేవదాసీ వ్యవస్థ చాలా ప్రాచీనమైనది. వైదిక కాలము నుండి మతంతో సంబంధం ఉన్న వ్యవస్థ ఇది. దేవదాసి అంటే దేవుని పరిచారిక లేక బానిస అని అర్థం. ప్రాచీనకాలంలోని బానిస వ్యవస్థలో ఇదొక భాగమని కూడ కొందరి అభిప్రాయము. బౌద్ధ సాహిత్యంలో, శాసనాలలో దేవదాసీలను బౌద్ధారామాలకు దానం చేసిన దాఖలాలున్నాయి. బౌద్ధారామాలకు నమూనాలుగా తరువాతి కాలంలో నిర్మింపబడిన వైదిక దేవాలయాలలో కూడ దాసీల ప్రసక్తి కనిపిస్తుంది.
తెలుగు సాహిత్యంలోనూ, శాసనాలలోను ఈ వ్యవస్థకు సంబంధించిన పరిశీలనాంశాలు ఎన్నో ఉన్నాయి. వీటనన్నిటిని సమగ్రంగా సేకరించి ఒక గ్రంథంగా ఎవరూ రూపొందించలేదు. ఆ దృష్టితో ‘ఆంధ్రసాహిత్యంలో, శాసనాలలో ప్రతిఫలించే దేవదాసీవ్యవస్థ’ అనే అంశాన్ని ఈ పరిశోధనకు గ్రహించడం జరిగింది. దేవదాసీ వ్యవస్థ పుట్టుక, వికాసం, పరిణామం, పతనం మొదలైన అంశాలన్నిటిని సమగ్రంగా పరిశీలించి సిద్ధాంతగ్రంథంగా రూపొందించడం ఈ పరిశోధన ఉద్ధేశ్యం. సిద్ధాంత వ్యాసం నాలుగు అధ్యాయాలుగా విభజించబడినది.
‘దేవదాసీ వ్యవస్థ ఆవిర్భావ వికాసాలు’ అన్నది ప్రథమ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవదాసీ పద నిర్వచనం ఈ వ్యవస్థకు మూలకారణాలు. ఇతర దేశాల్లో ఈ వ్యవస్థ రూపం దేవదాసీల విధులు, వారి జీవనభృతి మొదలైన అంశాలన్ని సవిమర్శకంగా చర్చించబడుతాయి. ‘తెలుగు శాసనాలు దేవదాసీ వ్యవస్థ పరిణామద’ అనే రెండవ అధ్యాయంలో దేవాలయ నిర్మాణం, వివిధ కాలాలలో ఆలయాలకివ్వబడిన దేవదాసీల వివరాలు, సంఘంలో దేవాలయాల ప్రాధాన్యత, దేవాలయంలో దేవదాసీల విధులు, దేవదాసీల భృతికి ఇవ్వబడిన దానవివరాలు, ఆలయ పరిపాలనా వ్యవహారాలలో దేవదాసీల పాత్ర, దేవదాసీలు సానులుగా మారడం, సంఘంలోని హోదాగల వ్యక్తులతో వీరి సంబంధాలు మొదలైన అంశాలన్నీ సప్రమాణంగా చూపబడుతాయి.
మూడవ అధ్యాయం ‘తెలుగు సాహిత్యం ` దేవదాసీ వ్యవస్థ పతన దశ’గా రూపొందించబడుతుంది. దేవదాసీ వ్యవస్థ కాలక్రమాన వేశ్యావ్యవస్థగా రూపుదిద్దుకొన్న విధం, వేశ్యావాటికల వర్ణనలు, సానుల సరసాలు, సానుల నియమనిష్ఠలు, సానులు ఒక తెగగా ఏర్పడిన విధం, వేశ్యలు ఆటవెలదులుగా మారడం మొదలైన విషయాలు వివరింపబడుతాయి.
‘ఆధునిక కాలం ` దేవదాసీ వ్యవస్థ వికృత దశ’ అనే నాలుగవ అధ్యాయంలో దేవదాసీల కులం, దేవదాసీలు నిత్య సుమంగళులైన విధం, దేవదాసీల ఇతర రూపాలు, ఆధునిక సాహిత్యంలో దేవదాసీల తీరుతెన్నులు, వేశ్యావృత్తి నిరోధక చట్టాలు, దేవదాసీ చట్టం మొదలైన అంశాలు వివరించబడినాయి.
ఈ పరిశోధన ప్రణాళికకు తెలుగుసాహిత్యం, తెలుగు శాసనాలు ప్రధాన ఆధారాలు. వీటితోపాటు ఈ విషయాన్ని స్పృశించిన ఇతరుల రచనలు కూడా సంప్రదించబడతాయి.
