-
-
ఆంధ్ర కలాపం
Andhra Kalapam
Author: Dr. Shyamala Ghantasala
Pages: 202Language: Telugu
కోట్ల సంవత్సరాలుగా ఎన్నెన్నో అవరోధాలని అధిగమించి, అన్యప్రాణులన్నిటిపైనా ఆధిపత్యాన్ని సాధించి, ప్రగతివైపు అడుగులు వేస్తూ ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్న క్రమంలో మూడు నాలుగు తరాల క్రితంవరకూ సజావుగా సాగిన మనిషి మనుగడలో ప్రస్తుతం కష్టసుఖాల అర్థాలు మారిపోయాయి. వీటికి నిర్దుష్టమైన నిర్వచనాలు లేవు. నేటి సమాజంలో అనుబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలుగా మిగిలిపోతున్నాయి. ప్రపంచంలో మరే ప్రాణికీ అవసరంలేని ‘డబ్బు’ని మనిషి సృష్టించాడు. ఒకనాటి ప్రజాజీవితానికి ఈ ’డబ్బు’ జీవన అవసరం మాత్రమే. సౌకర్యాలు సమకూర్చుకోవడానికే దాని ప్రాధాన్యత. ఐతే వైజ్ఞానికంగా విశేషంగా ప్రగతిని సాధించిన ఆధునిక మనిషి సౌకర్యాలని పెంచుకుంటూ మౌలికమైన ‘మాట’ విలువని మరచిపోతున్నాడు. భావవ్యక్తీకరణ ఆవశ్యకతని గుర్తించక, చేతకాక ఒత్తిడితో సతమతమౌతున్నాడు. ఆడ-మగ, చిన్న-పెద్ద, ముసలి-ముతక అందరిలోనూ చెప్పలేని నైరాశ్యం చోటు చేసుకుంటోంది. తోడబుట్టినవారికి, ఆఖరికి కన్నవారికికూడా తమవారికి కావలసినది ఏమిటో, వారేం చేస్తున్నారో తెలియని విచిత్రమైన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎటువైపు వెళుతోంది భారత ప్రజ? మనిషికీ మనిషికీ మధ్య శూన్యం, మౌనం ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? మరొకవైపు సామూహిక సంబరాలకి ఆహ్వానం పలుకుతూ ఫ్రెండ్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, లవర్స్ డే, వుమన్స్ డే అంటూ కొత్త పండుగల ప్రతిపాదనలని పరిచయం చేస్తోంది పాశ్చాత్య నాగరికత. ఒంటరితనంతో వేగిపోతున్న నేటితరం అత్యాధునిక భారతీయులు ఈ పాశ్చాత్య వేడుకలవైపు మొగ్గుచూపుతున్నారు. మనకు సంబరాలకు కొదువలేదు. కొత్తగా సృష్టించుకోవలసిన ఆవశ్యకత లేదు. లేనిదల్లా అవగాహన మాత్రమే.
అందరితో కలిసి, అందరినీ కలుపుకుపోగల సమిష్టి జీవితానికి, సంస్కృతికి వారసులు ఆంధ్రులు.
అనంతమైన చరిత్రకి వారసులు. ఏకాకితనానికి, నైరాశ్యానికి అణుమాత్రం స్థానంలేని ఆత్మీయమైన కుటుంబజీవితానికి ప్రతినిధులు. అపరిచితులనైనా తనవారిగా ప్రేమించగల హృదయం ఆంధ్రులది. ఇంత గొప్ప భారతీయ ఆత్మకి అద్దం పడుతున్న మహోన్నతమైన ఆంధ్ర చరిత్రని, సంస్కృతిని భావితరాలకి పరిచయం చెయ్యవలసిన అవసరం,అందించవలసిన ఆవశ్యకత ఎంతో వుంది. మురిపించే పాశ్చాత్యానుకరణ తప్ప మనకంటూ సంస్కృతి లేదా? అన్న ప్రశ్నకు సమాధానంగా మూలాలను వెతుక్కున్న ప్రయత్న ఫలితమే ఈ ‘ఆంధ్ర కలాపం’
పుస్తక రూపంలో అందుబాటులో వున్న చరిత్రని అధ్యయనం చెయ్యడంతో పాటు వివిధ ప్రాంతాలలో, గ్రామాలలో నివశిస్తున్న వయోవృద్ధులని ఎందరినో కలిసి, వారిద్వారా ఆంధ్రులు పాటిస్తున్న సంప్రదాయాలు గురించి, పండుగల గురించి చర్చించి తెలుసుకోవడం జరిగింది. అలా గ్రహించిన విషయాలని మూడు ప్రధాన అధ్యాయాలుగా విభజించి ఈ రచన చెయ్యడం జరిగింది.
మొదటి అధ్యాయం ఆంధ్రుల చరిత్ర. దీనిలో ఆంధ్ర దేశపు ఎల్లలు, భౌతిక వర్ణన, ఆంధ్ర రాజ్యస్థాపన, ఆంధ్రదేశానికి పూర్వకాలపు పేర్లు, ఆంధ్ర రాజ్యపతనాలని వివరించడం జరిగింది.
రెండవ అధ్యాయం ఆంధ్రుల సంస్కృతి. దీనిలో ఒకనాటి ఆంధ్రుల వైభవం, విజ్ఞానం, ఆధునిక యుగం, ఆంధ్రదేశంలో మతాలు, ఆంధ్ర ప్రజానీకం, ఆంధ్రుల కాలనిర్ణయం, ఆంధ్రుల చదువు గురించి వివరించడం జరిగింది.
మూడన అధ్యాయం ఆంధ్రుల సంప్రదాయాలు. ఆంధ్ర సంస్కృతిలో భాగమై నేడు కనుమరుగు అవుతున్న ఆంధ్రుల పండుగలు, నోములు, వ్రతాలు, ఆంధ్రుల జీవన విధానంలో భాగమైన గ్రామదేవతలు, ఆచారాలు, ఆంధ్రులకు ప్రత్యేకమైన కొన్ని వంటకాల గురించి యిందులో వివరించడం జరిగింది.
