-
-
అనర్ఘ్య
Anarghya
Author: Goutham Linga
Publisher: Avyuktha Prachuranalu
Pages: 130Language: Telugu
గౌతమ్ గారి రచనాధోరణిలో మంచి విద్యుద్రేఖలు మెరుస్తున్నాయి. శైలిలో మంచి పట్టు ఉన్నది. పదప్రయోగాలలో కవితాసామాగ్రి విశేషంగా ఉన్నది. ప్రయోగాత్మకమైన భావనాపటిమ పుష్కలంగా ఉన్నది. అధర్మం పట్ల ఆవేశాత్మక ఆవేదన ఉన్నది. ఇవన్నీ సమాజానికి చక్కగా ఉపయోగపడేవే. మునుముందు వీరి లేఖిని నుండి మరిన్ని మధురకావ్యాలు వెలువడాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను.
- డా. ఎం.పురుషోత్తమాచార్య
గౌతమ్ ఖమ్మం జిల్లా వాసి, వృత్తిరీత్యా ఇప్పుడు దక్షిణాఫ్రికాలో Software Developer గా పని చేస్తున్నాడు, ఒక సంవత్సరం కూడా నిండని పరిచయం మాది, తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల మమకారం, ఆసక్తి అతనిలో నిండుగా, మెండుగా కనిపించాయి. కవిత్వం పట్ల ఘాడ అనురక్తి అతనికి. తాత్విక, మార్మిక, సామాజిక, విప్లవాత్మక ఆలోచనలగుండా పరుగులుతీస్తుంది అతని మనసు. తన నిగూఢమైన ఆ ఆలోచనలను అక్షరాల్లోకి తర్జుమా చేయాలనుకుంటాడు. తన తాత్విక, మార్మిక భావనలను కవిత్వం చేయాలనుకుంటాడు. అందుకే గౌతమ్ కవిత్వంలో ఎక్కువగా ఘర్షణే కనిపిస్తుంది. ఆ ఘర్షణ మనిషి మనిషిలో కలిగే మానసిక ఘర్షణ. మనిషికి, సమాజానికి మధ్యన కలిగే సంఘర్షణ. వైరుద్యభావాల వైరి ఘర్షణ. ఈ ఘర్షణలోంచే ఉవ్వెత్తున ఉబికివచ్చే భావాలను ఇలా కవితలుగా, కవిత్వ సంపుటిగా మలచి మన ముందుకొస్తున్నాడు.
- రాపోలు సీతారామరాజు
ఈ పుస్తకంలో ఉన్న కవితలు సంఖ్య కంటే ప్రభావంలో చాలా ఎక్కువ. నిజానికి ఏకబిగిన ఈ కవితలు చదవడం సాధ్యం కాదు. ఒక్కో కవిత పలుమార్లు చదివి, ఆకళింపు చేసుకుని, ఆస్వాదించి, పదాలని పదేపదే తడిమి చూసుకుని, అర్థాన్ని లోపలకి ఇంకనివ్వాలి. అదే ఈ పుస్తకం చదవడానికి సరైన పధ్ధతి. కవి హృదయమే కాదు, కవి చెప్పిన ఏదో సృష్టి రహస్యం అప్పుడే బోధపడుతుంది.
గౌతమ్ రాసిన ఈ పుస్తకం సుదూర సాహితీ ప్రస్థానానికి ప్రవేశద్వారం అనిపిస్తుంది. వ్యక్తిగా తన అనుభవం, ఒక సమూహంలో సభ్యుడిగా తాను చూసే మార్పు, ఇంకేదో సార్వత్రిక సత్యంలో సూక్ష్మాన్ని అర్థం చేసుకునే స్పృహ పెరిగే కొద్దీ, పెద్దవాడయ్యే కొద్దీ, ఈ యువకవి లోకానికి ఇచ్చే కవితారత్నాల సంఖ్య, విలువ పెరిగిపోతూనే ఉంటుంది.
అందుకే ఈ పుస్తకం అమూల్యం. ఈ కవిత్వం అనవరతం పఠనీయం.
- ఉషా తురగా – రేవల్లి
