-
-
అమ్మకి ఆదివారం లేదా?
Ammaki Adivaram Leda
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 572Language: Telugu
ప్రకృతి గురించి నేర్చుకోవలసింది ఎంతో వున్నట్టే, సమాజం గురించి నేర్చుకోవలసింది అంతకన్నా ఎక్కువే. ఏ జ్ఞానం అయినా, అది సరిగా తెలిసేదాకా చాలా కష్టం. తెలిసిన తర్వాత చాలా తేలిక. గురువులేకుండా మనకు మనమే తంటాలుపడి నేర్చుకోవడం అయితే, దానికి యుగాలు పడుతుంది. ఎంతో కాలం వృధా అయిపోతుంది. ఒక్కోసారి జీవితాలే వృధా అయిపోవచ్చు.
ప్రకృతి గురించి పదార్ధ జ్ఞానం లేకపోవడం ఎలాంటి అజ్ఞానమో, మానవ జీవితం గురించి శ్రమ సంబంధాల జ్ఞానం లేకపోవడం అలాంటి అజ్ఞానం. అది, 'సత్యం' తెలియనితనం. సత్యం లేని చోట, అసత్యమే వుంటుంది. జ్ఞానం లేని చోట, అజ్ఞానమే వుంటుంది.
అసలు ఆలోచించడమే తెలియకుండా ఏ పాతికేళ్ళో ముప్పయ్యేళ్లో వచ్చేసి, అప్పుడు ఒకటి రెండు మంచి విషయాలు చెవినపడ్డా, వాటిని ఒప్పుకోలేనంత అజ్ఞానం స్తిరపడి పోతుంది. అప్పటికే బుర్రనిండా తప్పుడు అభిప్రాయాలు కిక్కిరిసి పోయి వుంటాయి.
సమాజం గురించి అసలు నిజమే తెలియకపోతే, కథలూ కవిత్వాలూ రాసేవాళ్ళు, ఏం రాస్తారు? ఆ సమాజంలో బతికే స్త్రీపురుషుల కుటుంబ సంబంధాల గురించి ఏం రాస్తారు? అంతా పాత రకంగానే రాస్తారు. ధనికుల్ని గొప్ప చేస్తూ రాస్తారు. పురుషుల్ని గొప్ప చేస్తూ రాస్తారు. వేల సంవత్సరాల నించీ దోపిడీ వర్గానికి అనుకూలిస్తూ వున్న భావాలనే తిరిగి తిరిగి చెపుతూ, వాటిని బతికించి వుంచుతూ రాస్తారు.
సమాజంలో ఏ విషయాల గురించైనా, ఏ సంబంధాల గురించైనా, సరిగా అర్ధమైతే, తప్పు భావాల్ని వదిలించుకోవడం చాలా తేలిక. లేకపోతే 'ఆ భావాలు , తప్పు భావాలు' అనే సంగతి కూడా ఆ భావాలు వున్న వాళ్ళకి తెలీదు.
మొత్తం మీద ఒక తరంనించి ఒక తరానికి, తప్పులే ఎక్కువగా అందుతున్నాయి, ఒప్పులకన్నా. తరాలూ జీవితాలూ అజ్ఞానాలతోనే ముగిసి పోతున్నాయి. సంగీతాలూ, సాహిత్యాలూ అస్తవ్యస్తపు భావాలనే అందిస్తున్నాయి.
జ్ఞానం నేర్చుకోవడం ప్రారంభమైతే, అదంతా ఒక దీర్ఘ క్రమం. ఆ క్రమం పొడుగునా ఎన్ని తప్పటడుగులో! ఎన్నిసార్లు వాటిని దిద్దుకోవాలో, సర్దుకోవాలో!
ఒక రచయిత, ఒకే విషయం మీద వేరువేరు కాలాల్లో వేరు వేరు రకాలుగా చెప్పి వుంటే, అందులో చివరిదాన్నే ఆ రచయిత అభిప్రాయంగా తీసుకోవాలి.
ఎవరో ఒక మంచి రచయిత, 'జీవితంలో బోలెడు కాలం బాల్యం మీద వృధా అయిపోతోంది' అన్నాడు కానీ, వృధా అయిపోయేది బాల్యం ఒక్కటే కాదు, మానవ జీవితం గురించి నిజమైన విషయాలు తెలియకపోతే, మొత్తం జీవితమే వృధా అయిపోతుంది!
