-
-
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు -2
America Illali Muchatlu 2
Author: Syamaladevi Dasika
Publisher: Vanguri Foundation of America
Pages: 174Language: Telugu
కథలు వ్రాయాలి అంటే అందులో ఏదో ఒక సామాజికస్పృహో, స్త్రీవాదమో లేక, దళితవాదమో, లేక తెలంగాణవాదమో, లేక ఏదో పోరాటమో మరో ఆరాటమో ఉండాలి అని అపోహపడే యువరచయితలకు, శ్యామలగారి రచనలు మార్గదర్శకాలు. ఈ బాణీ శైలులతో కథలు, పుస్తకాలు అంటే విసిగిపోయిన పాఠకుడికి ఈవిడ రచనలు ఒక కొత్త ఆసక్తిని రగిలించి, మళ్ళీ కథలు ఛదువు, ఏమీ ఫరవాలేదు, ఇంకా మంచి రచయితలు ఉన్నారు అని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కథలు అంటే ఆ మూసకథలే కాదు, కొత్త కొత్త ప్రక్రియలు ఎన్నో చేయెచ్చు అన్న నమ్మకాన్ని కలిగించి, పాఠకులను బతకించుకుంటాయి.
ఆవిడ కథలలో ఈ మూసప్రకృతులు ఎంత వెదకినా దొరకవు కదా, యద్దనపూడి సులోచనారాణిలాగా రొమాంటిక్ టచ్చులు కూడా ఉండవు, తెల్లగుర్రం వచ్చే రాకుమారులూ వుండరు, పౌరాణిక పాత్రలూ వుండవు. హాస్యమా అంటే కాదనలేము, అవునూ అనలేము. వ్యంగ్యమా అంటే అవునేమో కానీ, ఖచ్చితంగా చెప్పలేము. అసలు కథలేనా అంటే అవునూ అనలేము, కానీ చాలా బాగుంటాయి అని మాత్రం చెప్పగలము. వీటిని కథలు అనడం కంటే అనుభవాలు అంటే బాగుంటాయి. డైరీలో పేజీలు అంటే సరిపోతాయి కానీ, అలా అంటే వీటి స్థాయిని తగ్గించిన వారిమి అవుతాము. ఇది ఒక కొత్త శైలి, ఆమెకే చెందిన తన సొంతశైలి.
- రావు తల్లాప్రగడ.
