-
-
ఆమని పిలిచింది
Amani Pilichindi
Author: P. S. Narayana
Pages: 130Language: Telugu
కథానికకు కాని నవలకు కాని వస్తువు (ప్లాట్) ప్రధానం. వస్తువును రచయిత తన ప్రతిభతో నడిపిస్తాడు. చక్కటి వస్తూన్మీలన (డెవలప్మెంట్) కు సంఘర్షణ అవసరం. భిన్న దృక్పథాలుకల పాత్రలను సృష్టించి వాటి మధ్య ఏర్పడే సంఘర్షణ ఆధారంగా రచయిత పాఠకులకు పరోక్షంగా ఒక సందేశాన్ని అందజేస్తాడు. నవలలో నాటకీయతకూడా అవసరమే. పి.ఎస్.నారాయణగారు అనేక రచనలు చేసిన అనుభవజ్ఞుడు. అందువలన సహజంగానే చక్కటి కథావస్తువు నెంచుకున్నారు. తదనుగుణమైన పాత్రలకు రపాన్నిచ్చి వాటి వికాసాన్ని మరచిపోకుండా తీర్చిదిద్దారు.
‘ఆమని పిలిచింది’ నవలలో ప్రధానపాత్ర సులోచనదే. ఆ పాత్ర ద్వారా రచయిత గ్రామీణ వికాసానికి మార్గాన్ని సూచించారు. గ్రామీణ వికాసం ద్వారా దేశాభ్యుదయం సాధించవచ్చనీ, అందుకు స్త్రీలు` ముఖంగా చదువుకున్న స్త్రీలు బాధ్యత స్వీకరించాలనీ ఆయన చెప్పదలుచుకున్నారు. అలాగే కుటుంబంలో ప్రేమాభిమానాలు, సేవాభావం దానికితోడు కొంత నిస్వార్థం ఉంటేనే ఆ కుటుంబం నిలదొక్కుకుంటుంది. దారితప్పుతున్న సంపత్కు తగు రీతిలో ఈ విషయాలను అర్థమయ్యేటట్లు చేసింది సులోచన. పెద్దలపట్ల గౌరవం కూడా రానురాను తగ్గుతోందనీ, దానినీ పునరుద్ధరించాలని సంపత్కు సులోచన తెలియ చెప్పింది.
ధనార్జన అవసరమే కాని తల్లి దండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ధనాన్ని సంపాదించవలసిన పనిలేదు. గ్రామాలు మరీ మంచితనంతో నిండి లేవని, అక్కడ కూడా రాఘవలాంటి స్వార్థపరులుంటారనీ పి.ఎస్.నారాయణగారు సూచించారు.
వస్తూన్మీలనలో భాగంగా పెద్దగా మలుపులూ, ఉత్కంఠభరిత సన్నివేశాలూ లేకపోయినా పాఠకులను ఏకబిగిన చదివించే నవల, ఆమని పిలిచింది. నడక సుందరమై భాష ఈ నవల ప్రత్యేకత. పి.ఎస్.నారాయణ మరిన్ని నవలలను తెలుగు పాఠకులకు అందించాలని కోరుకుంటున్నాను. వారికి నా అభినందనలు.
- తుమ్మలపల్లి హరిహర శర్మ
