-
-
అక్షరయాత్ర
Aksharayatra
Author: Nanduri Ramamohana Rao
Publisher: Victory Publishers
Pages: 250Language: Telugu
ఈ సంపుటం సుమారు అయిదు దశాబ్దాల నా అక్షరయాత్ర సింహావలోకనం. ఇందులో ఎక్కువభాగం నేను గౌరవించే ప్రసిద్ధ వ్యక్తుల మూర్తి చిత్రణలు. తిరిగి అందులో అధికశాతం నేను అభిమానించే సాహితీమూర్తులు. మిగిలిన శాతం నా అభిమాన గాయకులు, చిత్రకారులు, నటులు మొదలైన వారు. వివిధ సందర్భాలలో వ్యక్తుల గురించి కలంచిత్రాలుగా రాసినవి కొన్ని కాగా, పుస్తకాల పీఠికలు, పుస్తకాల సమీక్షలు, విశేష సంచికలనుంచి సేకరించినవి, చలన చిత్ర సమీక్షలు, ఇంకా కొన్ని ఉఫ్ అంటే ఎగిరిపోయేటంత తేలికైన - అంటే లైటర్వెయిన్ వ్యాసాలు - అన్నీ కలిసి ఈ సంకలనం ఒక పెద్ద కలగూరగంప; రకరకాల రంగురంగుల పూల కదంబం. సందర్భానుసారంగా రాసినవైనప్పటికి, స్వల్పంగా భాషలోను, మరీ సకృత్తుగా భావాలలోను తప్ప, పెద్దగా మార్పులేమీ చేయలేదు.
కడచిన అయిదు దశాబ్దాల నా జీవిత పథంలో సహజంగానే ఎందరెందరో ప్రముఖులతో, ప్రసిద్ధులతో నాకు వ్యక్తిగత పరిచయాలు ఏర్పడ్డాయి. అది నా అదృష్టం. ఆ స్నేహసౌరభాలు, పరిచయపరిమళాలే నాకు పాథేయాలుగా, ఉపాదేయాలుగా ఉపయోగపడ్డాయి. ''బిబ్లికల్ త్రీ స్కోర్ అండ్ టెన్'' ఘట్టాన్ని అధిగమించిన ఈ సమయంలో వాటి అక్షరీకరణలను కొన్నిటినైనా సేకరించి, సంగ్రంథించాలని ఒక చాపల్య వీచిక వీచగా, ఈ పుస్తకం ఆకృతి ధరించింది. దాదాపుగా ఇందులోని వన్నీ పత్రికారచనలే అయినా, ఇది నా వైయక్తిక అభిరుచులకు, అభిమతాలకు, అభినివేశాలకు, అనుభవాల స్మృతులకు నిలువుటద్దంలాంటి సంకలనం. దీని బాగోగుల నిర్ణయం నా పాఠకుల సహృదయతా నికషోపలానికే వదలివేస్తున్నాను.
- నండూరి రామమోహనరావు
