-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఆకాశం (free)
Akasam - free
Author: B.V.V.Prasad
Publisher: Self Published on Kinige
Pages: 142Language: Telugu
ఆకాశం
ఇపుడు ఆకాశం తరచూ కవిత్వమవుతోంది
సారం కనరాని ఆకాశం రసార్ణవమెలా అయిందని అతనాలోచించాడు
ఆకాశం బహుశా తన ఆకాంక్షల ప్రతీకలా వుంది, తన లక్ష్యంలా వుంది
అంతస్సారానికి చెందిన అనేకభావాలకి ఆకాశం ప్రతీక
ఉద్వేగాలతో కలుషితంకాని మనస్సుకీ
అనుభవాలతో కలతచెందని మెలకువకీ
ఆలోచనల ఆటంకంలేని స్ఫురణకీ
కోరికల వెలితిలేని ఆనందానికీ
ఏ బంధం ఆపలేని స్వేచ్ఛకీ
సరిహద్దులు తెలీని విశాలత్వానికీ ప్రతీక ఆకాశం
సృష్టికి తానే కారణమై ఏమీ ఎరగనట్లుండే స్వచ్ఛతకీ
అన్నిటినీ తనలో పొదువుకొని, అన్నిటిలో ఒదిగి
ఏదీ తనది కాదన్నట్లుండే నిర్మలప్రేమకీ
ఉండీలేనట్లుండే ఉదాత్త స్వభావానికీ ఆకాశం ప్రతీక
మనం ఆకాశం పిల్లలమనీ, చిన్నచిన్న ఆకాశాలమనీ
మనని ఎప్పడూ వదలని అమ్మలాంటి ఆకాశాన్ని
మనమే తప్పించుకొని, తప్పిపోయామనుకొని
సదా వెదుకుతూ తిరుగుతున్నామని అతను గమనించాడు
సదా మనని కలగంటుంది అమ్మ ఆకాశం
అమ్మ ముఖంలోకి చూడటంకన్నా ఆనందం ఏముందని
తన తల్లిని తనలో కనుగొనటంకన్నా అందమైన పని ఏమిటని
అతను తనలోకి తిరిగి, తన ఆకాశం కనుగొని
తన ఆకాశంలో బహుజన్మల దుఃఖంనుండి విశ్రాంతిపొంది
ఆకాశంనుండి అపుడే పుట్టిన ఆకాశంలా మళ్ళీ మనని పలకరిస్తాడు
మనలోపలి నిర్మలాకాశానికి అద్దమై మనముందు నిలుస్తాడు
