-
-
ఐతరేయం
Aitareyam
Author: Ravuri Bharadwaja
Publisher: Balaji Granthamala
Pages: 88Language: Telugu
తెలుగు సాహిత్యంలో స్మృతి రచనలు చాలా వచ్చాయిగానీ, దిన చర్య రూపంలో వచ్చిన పుస్తకం ‘ఐతరేయం’.
కాంతమ్మ మరణించిన నాటి నుండి ఆ సంవత్సరం దాక, భరద్వాజ డైరీలో కాంతమ్మను గురించి ఉన్న విషయాలను, తేదీల వారీగా సంపుటీకరించాక, "నాలోని నీవు" అన్న పుస్తకం ప్రచురించబడింది. 1987వ సంవత్సరపు డైరీలోని అంశాలతో, "అంతరంగిణి" అన్న పేరున రెండో పుస్తకం వెలువడింది. ఈ మూడోది "ఐతరేయం". ఇది 1988వ సంవత్సరపు డైరీలోని అంశాలతో కూర్చిన పుస్తకం.
చేతనావరణానికి ఆవలగా, భాసిస్తున్న నిత్యచైత్యన్య శక్తిని దర్శించాలన్న తహతహ, ఒకానొక గుప్తస్మృతిని ఆవిష్కరించాలన్న సాంద్రమైన జిజ్ఞాస, ఈ మూడు పుస్తకాల్లోను స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.
- త్రిపురనేని సుబ్బారావు
‘ఐతరేయం’, కేవలం కాంతమ్మ గారి కథ కాదు, భరద్వాజగారి ఆత్మకథా కాదు. ఇదొక అంతర్మధనం. సృష్టిలోని వైచిత్రికి స్పందించిన ఒక ఆర్ష కథనం. క్రౌంచ మిథునం పొందిన అవేదనతో స్పందించిన ఋషి వలె, ‘కాంతమ్మ మరణం’ అనే ఒక నిమిత్తంతో స్పందించిన ఒక (రస) ఆర్ధ్ర హృదయం నుంచి జాలు వారిన అక్షర స్రవంతి. ఇక్కడ కాంతమ్మ తల్లి, చెల్లి, భార్య, బంధువు, దైవం-అనంతవిశ్వం - కాంతమ్మ కేవలం ఒక సంకేతం, ఇది అర్థం కాకపోతే, ‘ఇదంతా కేవలం భార్యా వియోగ కావ్యం’ (ఎలిజీ)గానే చాలామంది భ్రమించవచ్చు.
భరద్వాజగారి కాంతమ్మ, లౌకిక పాఠకులకు, ఒక స్త్రీ. ఒక పెద్దమనిషిగారి ఉత్తమ ఇల్లాలు. కానీ ‘ఐతరేయం’లోని ఆంతర్యం, ఇంకా లోతైనది. అనంత శక్తి స్వరూపానికి, భరద్వాజ తన అన్వేషణలో, పెట్టుకున్న ఒక పేరు కాంతమ్మ!
ఈ దృష్టితో ఈ పుస్తకాన్ని కాదు; ఈ డైరీల పరంపరలో వెనుకటివి కూడా చదవండి. కొత్త లోకాలు కనబడతాయి.
- డా. ముదిగిండ శివప్రసాద్
