-
-
ఆదిత్యహృదయము
Aditya Hrudayamu
Author: Guhabhattarakudu
Publisher: BPMD Publications
Pages: 51Language: Telugu
పరమపావనమైనది, వాల్మీకిమహర్షికృతమైనది, దేవమునిగణముల మొదలు పామరజనసందోహముల వరకూ అందరూ పారాయణచేసి తరించగలిగినది అయిన పుణ్యచరితము శ్రీమద్రామాయణము.
౨౪ వేల శ్లోకములు కలిగిన ఈ మహేతిహాసము ౨౪ అక్షరముల సాక్షాత్ గాయత్రీమహామంత్ర స్వరూపమని మహర్షుల ఉవాచ.
ఈ కావ్యమునందలి ప్రతి కాండ, ప్రతి సర్గ, ప్రతి శ్లోకమూ పరమపవిత్రమైనవి. సాధకులకు ఇహపర ఫలితములను ఇచ్చునవి.
అందు యుద్ధకాండనందలి ౧౦౫వ సర్గ మరింత పవిత్రతను ఆపాదించుకొన్నది. సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్ర ప్రభువు రావణునితో సంగ్రామము సలుపుతూ అలసి ఉన్నప్పుడు, మహాత్ముడు, అన్ని లోకములవారికీ ప్రాతఃస్మరణీయుడు, భగవత్స్వరూపుడు అయిన అగస్త్యమహర్షి ఆ యుద్ధక్షేత్రమునకు అరుదెంచి శ్రీరామచంద్రమూర్తికి జయము కలుగుటకై ఉపదేశించిన మహోన్నత స్తోత్రరాజమే ఈ “ఆదిత్యహృదయము”.
అగస్త్యమహర్షి అనుగ్రహించిన ఆ స్తోత్రమును వారి ఉపదేశానుసారము ముమ్మారు పఠించి ప్రత్యక్షనారాయణుడైన ఆ సూర్యభగవానుణ్ణి ఆరాధించి ఆ దేవదేవుని అనుగ్రహంతో రావణసంహారము చేసి లోకకల్యాణమొనర్చినాడా జానకీపతి.
అట్టి మహత్తు కలిగిన ఈ దివ్య స్తోత్రమును ప్రతిపదార్థ, తాత్పర్య సహితముగా భక్తజనులకు అందజేయ సంకల్పమునకు నా స్వామి శ్రీరాముని అనుజ్ఞయైనది.
సకలభయవినాశిని, ధవళకీర్తి ప్రదాయిని, సర్వకార్యార్థసిద్ధికరి, ఆయురారోగ్యైశ్వర్యప్రదాయిని, బ్రహ్మానందకారిణి అయిన ఈ ఆదిత్యహృదయమును అనుదినం ముమ్మారు పఠించి సర్వులునూ శుభములను బడయగలరని ఆశిస్తూ ఆ లోకోత్తర మహాపురుషుడైన శ్రీరామచంద్రమూర్తిని, కనులముందు కదలాడే లోకారాధ్యుడు సూర్యభగవానుని మనసా స్మరిస్తూ స్వస్తి!
శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః
- గుహభట్టారకుడు
గమనిక: " ఆదిత్యహృదయము " ఈబుక్ సైజు 5.2mb
