"వైశాలి నేను పబ్లిక్‌గా అందరికంటా పడేటట్లు క్లబ్ లోకి పోతాం. మాకు కొంచెం దూరంలో నిలబడి సిద్ధంగా వుండాలి మీరు... పరిస్థితులు చేతులుదాటి గొడవ ఏదైనా ప్రారంభంఅయితే వెంటనే కల్పించుకోవాలి... అర్థం అయిందా?" అని అడిగాడు.
"యస్ సర్... బాగా అర్థం అయింది... అసలు మీరు మాట్లాడటం మాకు అర్థం కాకపోవటం అంటూ ఎప్పుడైనా జరిగిందా?" అంటూ కుడిచేతిని జాచాడు కిషన్.
"ఏమిటి? ఎందుకు ??" ఆశ్చర్యంగా అడిగాడు సాధు.
"టిప్ కోసం సార్... దిల్ బహార్ నైట్ క్లబ్లో నోరు తెరిచి ఏదైనా మాట మాట్లాడాలంటే ముందుగా ఎంతో కొంత టిప్ ఇవ్వాల్సిందేనట.... ఈ బట్టలు ఇచ్చిన దొంగనాయాళ్లు చెప్పారు..." చేతిని వెనక్కు తీసుకోకుండానే సమాధానం ఇచ్చాడు కిషన్.
నిస్సహాయంగా భుజాలు ఎగరవేసి మరో కరెన్సీ నోటును తీసి అతని చేతిలో పడేశాడు సాధు.
"క్లబ్ యూనిఫాం వేసుకొని టిప్‌లు వసూలు చేయగానే సరిపోదు. మిమ్మల్నిగుర్తించి క్లబ్లో వున్న స్టాఫ్ మక్కెలు విరగేయకుండా జాగ్రత్తపడండి..." అని హెచ్చరిస్తూ వైశాలిని వెంట బెట్టుకొని ముఖద్వారం గుండా క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు.
