-
-
ఆ అరగంట చాలు
Aa Araganta Chalu
Author: Kasturi Murali Krishna
Publisher: Kasturi Prachuranalu
Pages: 128Language: Telugu
తెలుగులో భయానక కథల తొలి సంపుటి "ఆ అరగంట చాలు".
భయానక కథలు అనగానే దయ్యాల కథలు, దయ్యాలు పీక్కుతినటం, రక్తమాంసాలు వెదజల్లటం, చివరికి 'అంతా కల' అని తేలటం లాంటి మూసకథలు కావివి. హారర్ కథలలో అనేక వర్గీకరణలున్నాయి. ఈ సంపుటిలోని ఒకో కథ ఒకో ప్రత్యేక కేటగిరీకి చెందినది.
ప్రతి కథలో ఒక చమత్కారం, ఒక జలదరింపు, ఒక ఆలోచన కలిగేటట్టు కథను సృజించాను. అందుకే కొన్ని కథలు చదువుతుంటే అవి భయానక కథల కన్నా 'సస్పెన్స్' కథలుగా అనిపిస్తాయి. కానీ కథ పూర్తయిన తరువాత ఒక్కసారి కళ్లు మూసుకుని కథను ఊహిస్తే, కథలోని సంఘటనలను తలచుకుంటే అప్పుడు జలదరింపు కలుగుతుంది.
ఈ కథలలో అధికశాతం ప్రథమ పురుషలో 'నేను' అంటూ చెప్పినవే. ఎందుకంటే భయాన్ని సృజించటంలో 'నేను' అని చెప్పటం ద్వారా పాఠకుడి దృష్టిని నేను ప్రసరింపచేయదలచుకున్నంత వరకే పరిమితం చేసే వీలుంటుంది. తద్వారా అసలు 'నిజం' తెలిసినపుడు జలదరింపు కలుగుతుంది. దీనికి తోడుగా, పాత్ర అనుభవిస్తున్న భావాలు 'నేను' అని చెప్పటం వల్ల పాఠకుడికి మరింత చేరువ అవుతాయి. అందుకే అధికశాతం కథలు ప్రథమ పురుషలో రూపొందాయి. ఈ కథలన్నీ దృశ్యాత్మకం. కాబట్టి, పాఠకులు ఈ కథలు చదువుతూ కథ చెప్పిన విధానం, మూడ్ను సృజించిన విధానం, దృశ్యాలను కథకనుగుణంగా మలచిన విధానం, ముఖ్యంగా, పాఠకుడిని తప్పుదారి పట్టించి 'షాక్' కలిగించిన టెక్నిక్లను గమనించి ఆనందించమని ప్రార్థన.
జీవితం సప్తవర్ణాల సమ్మిశ్రితం. అన్ని వర్ణాలనూ అనుభవించాలి. ఏ వర్ణం లోపించినా అది తీరని లోటే. కాబట్టి సప్తవర్ణాల సమ్మిశ్రితమైన ఇంద్రధనుస్సు లాంటి సాహిత్య ప్రపంచంలో 'హారర్ స్టోరీ' కూడ ఓ వర్ణం. అందుకే ఎలాంటి అపోహలు, రంగుటద్దాలు లేకుండా కథలను చదవండి. అనుభవించండి. ఆనందించండి. పదిమందితో పంచుకోండి.
- కస్తురి మురళీకృష్ణ
ఈ పుస్తకం పై కౌముది.నెట్ జనవరి 2013 సంచికలో వచ్చిన పరిచయం ఇక్కడ చదవండి.