ఆశారాజు కవితలు చదివినాక, మనం ఒక్క క్షణం పాటు ఆగిపోతాము (మోళీ ఏదో మనపై విసిరినట్లుగా). గొప్ప పదాల బరువు లేదా విభ్రమకు లోను చేసే ప్రతీకలు, పదబంధాలు ఏమీ ఉండవు. కానీ ఆయన కవితల్లో పరిపూర్ణమైన integrity ఉంటుంది. మంద్రంగా అల్లుకుపోయిన narrativeతో ఒక సమగ్ర రూపం ఉంటుంది. జీవితం, ప్రేమ, ప్రేమరాహిత్యం, నాస్టాల్జియా; ఇద్దరు స్నేహితులు తమ passionని పంచుకున్నట్లుగా, ఆశారాజు కవితలు మనతో సంభాషిస్తాయి.
ఇప్పుడు 'ఎ పొయిట్ ఇన్ హైదరాబాద్' అంటూ, ఒక షాయర్ డైరీని ఆవిశ్కరిస్తున్నాడు. హైదరాబాద్ సిటీని తన కవితల్లో సంకీర్తనం చేస్తున్నాడు. హైదరాబాద్ ఏ మూలకు వెళ్ళినా, అతనికి చిన్నప్పుడు పరిచయమైన 'రహస్య పరిమళం' ఏదో గుప్పుమంటుంది. హైదరాబాద్ అనే మిత్ని అతని కవితల నిండా సెలెబ్రేట్ చేస్తున్నాడు.
'ఎ పొయిట్ ఇన్ హైదరాబాద్' ఒక collective memory. సంవత్సరాల జ్ఞాపకమేదో, గొంతులో గురగురమంటుండగా పాడిన మనోహరమైన పాట.
చార్మినార్ ఎదురుగా రంజాన్ మాసపు నెలలో బ్రహ్మాండమైన ధగధగలతో మెరిసిపోయే రాత్రుల సౌందర్యం, ఈ పుస్తకం.
- డా. వి. చంద్రశేఖరరావు
