"ఇక ఆలస్యం ఎందుకు సార్? స్వామీజీ ఈపాటికి ఫయాలీ చేరుకొని వుంటాడు. మనం గూడా బయలు దేరటం మంచిది... మళ్ళీ చైనీస్ సైనికులు ఎవరైనా చూస్తే లేని పోని గొడవ" అంటున్నాడు షాడో.
ద్వారంలో నుంచి వికటమైన నవ్వు ఒకటి వినిపించింది. ఉలిక్కిపడి అటు చూశారు అందరూ. అప్రయత్నంగా ఆయుధాలమీద చేతులు వేశారు.
"నో...నో....అటువంటి పనులు చేయకండి. మా మెషిన్ గన్స్ ముందు తుక్కు తుక్కై పోతారు." అంటూ లోనికి వచ్చాడు ఒక చైనీస్ ఆర్మీ కమాండర్.
మెషీన్ గన్స్ పట్టుకొని అందరినీ కవర్ చేస్తున్నారు పాతిక మంది సైనికులు.
* * *
"వెల్ మిస్టర్ షాడో... దిసీజ్ ఎ గ్రేట్ సర్ప్రయిజ్. ఎవరికీ చిక్కని మైటీ షాడో ఈ నాటికి మాకు చిక్కాడు. మా యింటలిజన్స్ వాళ్ళు నిన్ను చూడటానికి ప్రాణాలు యివ్వమన్నా యిస్తారు... ఓహ్ ముఖేష్! మైగాడ్...సి.ఐ.బి. సీనియర్ ఏజెంట్ ముఖేష్! ఏమిటి ఈ అవతారం?" ఆశ్చర్యాన్ని నటించాడా కమాండర్.
కులకర్ణిగారిని చూసేసరికి నిజంగానే ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. "నిజంగా మాకు ఈ రోజు వెరీ లక్కీ డే. ఇండియన్ సి.ఐ.బి. మూల స్తంభాలన్నీ మాకు దొరికాయి. ఇందాక మాకు వచ్చిన వార్త అసత్యం కాదు. సరిహద్దులు దాటి కొందరు భారతీయులు మలాయ్ దగ్గిర కాంప్ వేశారని యిక్కడి గ్రామస్తులకు తెలియచేశాట్ట ఒక వ్యక్తి. అతనెవరో మాకు తెలియదు. అయినా నిజంగా చాలా మంచి పనిచేశాడు కనిపిస్తే మంచి పొజిషన్ యిచ్చి గౌరవిస్తుంది మా ప్రభుత్వం." అంటూ ఆనందపడి పోయాడు.
