దేవరకొండ బాలగంగాధర తిలక్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న జననం. 1966 జూలై 1 న మరణం.
'అమృతం కురిసిన రాత్రి' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.
తిలక్ అనగానే గుర్తొచ్చేది... అమృతం కురిసిన రాత్రి. తిలక్ పేరు తలచుకోగానే 'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అన్న వాక్యం స్ఫురించకతప్పదు. తిలక్ కవిగానే కాదు, కథకుడిగా కూడా తనదైన ముద్ర వేసారు.
తిలక్ మద్రాస్ లయోలా కాలేజిలోనూ, విశాఖ ఎ.వి.ఎన్. కాలేజిలోనూ ఇంటర్ చదువుతూ, అనారోగ్య కారణాల వల్ల ఆపేసారు. తణుకులో విజ్ఞాన పరిషత్ స్థాపించారు. తర్వాతి కాలంలో దానినే 'సాహితీ సరోవరం'గా మార్చారు. తిలక్ కవితలు, కథలే కాదు, నాటకాలు కూడా రాసారు. బృందావన కళా సమితి అనే సంస్థని స్థాపించి నాటకాలు వేయించారు.
మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను ఉపయోగించుకున్నారు. రోజూవారీ జీవితంలో మనకు తారసపడే అభాగ్యులను, మోసగాళ్లను ఆయన పాత్రలుగా తీసుకుని అసలు రూపాలతో మన ముందు నిలబెట్టారు.
తిలక్ తన మొదటి కథని 11 వ ఏట రాసారు. 'మాధురి' పత్రికలో ప్రచురితమైన ఆ కథ ఇప్పటికీ అలభ్యం. ఆయన 16 ఏళ్ళకే రాసిన పద్యాలు, గేయాలు 'ప్రభాతము - సంధ్య' పేరుతో 1938లో తొలి సంపుటిగా వచ్చింది.
గోరువంకలు, కఠినోపనిషత్తు,
అమృతం కురిసిన రాత్రి ఇతర కవితా సంకలనాలు. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.
తిలక్ కథలు, సుందరీ-సుబ్బారావు, ఊరి చివరి యిల్లు తిలక్ కథా సంకలనాలు. సుశీల పెళ్లి, సుప్త శిల, సాలె పురుగు తిలక్ రాసిన నాటకాలు. 1956-66 మధ్య కాలం తిలక్ రచయిత శిఖరారోహణ చేసిన కాలం.
అమృతం కురిసిన రాత్రి కావాలండి