-
-
పాము
paamu
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 384Language: Telugu
“రక్తం.... రక్తం.... రక్తంధారలు కనిపిస్తోంది నాకు. నా పుట్ట వున్న గుట్ట మొదట్లో రక్తం కాలువలు కడుతున్నట్లు అనిపిస్తోంది. రండిరోయ్ రండి... అందరూ రండి... త్వరగా రండి. ఆ లలితమ్మ ఎక్కడ వున్నదో చూసి వెంటనే నా దగ్గిరికి తీసుకురండి” ఉన్నట్లుండి లేచి నిలబడుతూ గొంతు చినిగిపోయే శృతిలో కేకలుపెట్టడం మొదలుపెట్టింది గణాచారి.
ఊరి మధ్యలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఎదుట పెద్ద పందిరివేసి, హరికథలు చెప్పిస్తున్నారు గ్రామ పెద్దలు. రాత్రి ఎనిమిదింటికి మొదలు అయింది ఆ రోజు కథ... సుభద్రా పరిణయంలో అర్జునుడు సుభద్రను తీసుకుని ద్వారకా నగరంలో నుంచి పారిపోయి వచ్చే ఘట్టాన్ని రమ్యంగా చెపుతున్నాడు హరికథలు చెప్పటాన్ని నేర్చుకొచ్చిన ఆలయ పూజారి
మనువడు.
“దీనిదుంపతెగ... కురుక్షేత్ర యుద్ధం కథ చెప్పేటప్పుడు నెత్తురు కనిపిస్తోందని కేకలు పెట్టటంలో అర్థం వుంటుంది. సుభద్రా కల్యాణంలో నెత్తురు నెత్తురంటూ లేచి నిలబడింది. దీనికి పట్టింది పూనకం కాదు. పిచ్చి... ఇది పూనకాల పిచ్చే. సందేహంలేదు” సన్నటి కంఠంతో తన పక్కన వున్న పెద్దాయనతో అన్నాడు ఒక పౌరుడు.
“ఎవడ్రా? ఎవడ్రా నన్ను వెక్కిరిస్తోంది? ఎవడ్రా అది?” కళ్ళను పెద్దవిచేసి కోరగా చూస్తూ చెవులు చిల్లులుపడే స్థాయిలో అతి బిగ్గరగా అరిచింది గణాచారి.
చటుక్కున నోటిని మూసుకుని తలక్రిందికి వంచేసుకున్నాడు ఆ పౌరుడు. పక్కనవున్న పెద్దాయన వెక్కిరింపుగా నవ్వినా ఏమాత్రం పట్టించుకోలేదు.
“లలితమ్మ... లలితమ్మను పిలవండిరా అంటే మూగమొద్దులమాదిరి అలా నిలబడిపోతారేమిటిరా? పిలవండిరా... వెంటనే నా దగ్గిరికి రమ్మని చెప్పండి” జుట్టు విరబోసుకుని తాచుపాము ఊగినట్లుగా ముందుకీ వెనక్కీ ఊగుతూ రెట్టించి అరిచింది గణాచారి.
PLEASE ENABLE RENT OPTION
Enable rent option for ebook.