-
-
మిడ్ నైట్ ప్లస్ వన్
Midnight Plus One
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 306Language: Telugu
"మిడ్ నైట్ ప్లస్ వన్" థ్రిల్లర్ రెండు భాగాలు కలిపిన సంపుటం ఇది.
* * *
“యువార్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మిస్టర్ షాడో…..” కను చివరల నుంచి షాడో ముఖంలోకి చూస్తూ, అతని ముఖంలోని భావాలను బట్టి ఆలోచనల్ని ఫాలో అవుతున్న కులకర్ణిగారు వున్నట్లుండి అనేసరికి, ఉలికిపాటును కప్పి పెట్టుకోవటానికి విపరీతమైన ప్రయత్నంచేస్తూ ఈలోకంలోకి వచ్చేశాడు షాడో.
“డాక్టర్ శంభూ ముందుగానే హెచ్చరించినట్లు అల్లకల్లోలమై పోయింది జూబ్లీ హాలు. ఆ ఫంక్షన్‌కి అటెండ్ అయిన ఛీఫ్ గెస్ట్‌లతో పాటు, మరో ఇద్దరు పెద్ద మనుష్యులు ఫంక్షన్ మధ్యలో వెర్రిగా అరుస్తూ సీట్లలో నుంచి క్రిందికి పడిపోయారు. అక్కడవున్నవారిలో డాక్టర్స్ కొందరు ఫస్ట్ ఎయిడ్ చేసినా స్పృహలు రాలేదు. అంబులెన్స్‌లను పిలిపించి హాస్పిటల్స్‌కి రషప్ చేయించిన అరగంట తరువాత అందరికీ తెలిసింది ఒక దారుణమైన వార్త.
“తాము ఎవరో, తమ హోదా ఎటువంటిదో తెలుసుకోలేనంతగా మతులు పోగొట్టుకున్నారు ఆ విక్టిమ్స్. ఎందుకూ పనికిరాని వెజిటబుల్స్గా మారిపోయారు” సగంవరకూ కాలి ఆరిపోయిన సిగార్ని మరోసారి వెలిగించుకుంటూ చెప్పారు కులకర్ణి.
“దటీజ్ ఓన్లీ ది బిగినింగ్ మిస్టర్ షాడో…” వెంటనే కల్పించుకుంటూ అన్నాడు అంతకుముందు ప్రశ్నలు వేసిన బంగ్లా దేశీయుడు.
“ఆ తరువాత అటువంటి ఇన్సిడెంట్సే మరో రెండు జరిగిన తరువాత వన్ ఫైన్ మార్నింగ్ ఇవి మాకు అందాయి…” అంటూ నాలుగు కాగితాల్ని షాడో చేతికి అందించాడు.
