-
-
శ్రీ నరసింహ, వేంకటేశ్వర శతక ద్వయము
Sri Narasimha Venkateswara Sataka Dwayamu
Author: Ramulu Sadhula
Publisher: Self Published on Kinige
Pages: 118Language: Telugu
ఏక కాలంలో శతక ద్వయాన్ని ప్రకటిస్తూ ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కవివర్యులు రాములు సాధుల గారికి అభినందనలు!!
"ధర్మపురివాస నరసింహ ధర్మరక్ష" అను మకుటంతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, "వేంకటేశ్వరా వినుము నా విన్నపంబు" అన్న మకుటంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ని కొలుస్తూ తమ సృజనను జోడించి.. పద్య రూపంలో హృద్యంగా కవితా సుమాలను ఉభయ స్వాములకు ఉడతాభక్తిగా సమర్పించుకున్నారు.
ఇందులో స్వామి వారిని భక్తి ప్రపత్తులతో అనేక రకములుగా సంబోధిస్తూ సర్వేశ్వరుడు జ్ఞాన ప్రదాతయని, కలతలేని జ్ఞానంబు కలుగజేయమంటాడు.
"కలౌ వేంకట నాయక:" కలికాలమున భక్తులు పిలువగానే పలికి, తలువగానే తలుపుల నీడేర్చు ప్రత్యక్షదైవము శ్రీ వేంకటేశ్వర స్వామి. అట్టి శ్రీ వేంకటేశ్వరుని పై అనేకములైన శతకములు ఎందరో కవులు వెలయించిరి. ఎవరి భక్తి ప్రపత్తులు వారు చాటుకొనిరి. అదే విధముగా ఈ కవి గారు స్వామి వారి పై సీస పద్య శతకమును రచించిరి. ఇందులో భక్తి భావన ఆత్మాశ్రయ కవిత ఎక్కువ. ఈ బాహ్యమైన కనులు చాలవు పరమత్మను దర్శించు ఆంతరంగిక కనులు కావలెననంటారు.
"కనులు జాలవు నినుజూడ కమలనయన
పుణ్యనేత్రముల్ కావయ పుణ్య పురుష
నీవు కనిపించు కనిలుమ్ము నీలవర్ణ"
పరమాత్మ సర్వజగద్వ్యాపి, అందుకే స్వామి వారిని
"ఆది మధ్యాంతమే లేని అప్రమేయ
అండపిండము బ్రహ్మాండ మఖిలమీవె
గరుడ వాహన! కంజాక్ష కమల నయన" అని స్తుతిస్తాడు.
"నిన్ను గానక అన్యుల నేను జేర
సర్వమును నీవె నాకిక సార సాక్ష" అనియు
"సర్వశక్తులు నీయాజ్ఞ సంచరించు
నీకటాక్షంబె పదివేలు నీలవర్ణ"
"నీదు నామమే నాకిక నిత్య సుఖము
నీదు నామమే మోక్షంబు నిశ్చయంబు" అని ప్రార్థించినారు.
విష్ణువు దశావతరాలను, ప్రస్తుతిస్తూ అందమైన ప్రాసలనుపయొగిస్తూ సరైన రీతిలో సరైన విధంగా మాటలను కూర్చుతూ, ఈ సీస పద్యాలను అందించారు. ఈ శతకాల ద్వారా రాములు గారు కవితా విశ్వరూపాన్ని, రచనా వైశిష్ట్యాన్ని తెలియచేసారు. లోకం పొకడను, భగవంతుని లీలలను, మనం ఆచరించాల్సిన కర్మలను సునిశతంగా, ఎవరినీ నొప్పించని విధంగా ఈ పద్యాల్లో గుప్పించారు.
