-
-
పరేంగిత ప్రజ్ఞ
Parengita Pragna
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 208Language: Telugu
విలక్షణ వ్యక్తులు మాత్రమే చరిత్రను తిరగ రాస్తారన్నది చారిత్రక సత్యం. కొందరు చరిత్రను సృష్టిస్తారు. కొందరు సమాజాన్ని మలుపు తిప్పుతారు. కాని మనసుకు జవజీవాలందించేవారు చాలా తక్కువ. విలక్షణ వ్యక్తులవల్ల పరిణామం ముందుకు సాగుతుంది. మనల్ని మనం పరిశీలించుకునేటట్లు చేసినవారు కాలం పరీక్షకు నిలబడి చరిత్ర ప్రసిద్ధులవుతుంటారు. కాలాన్ని జయించి, కల్లోలాన్ని సృష్టించినవారే మహాత్ములు, వైతాళికులు, స్మరణీయులు. దాదా గవంద్ ఆ కోవకు చెందిన విలక్షణ ప్రతిభాశాలి. వినయశీలి.
తాత్విక గ్రంథాలు అసంఖ్యాకంగా వస్తుంటాయి. కాని తత్వవేత్తల జీవిత చరిత్రలు చాలా అరుదు. తాత్వికతకు మెరుగులు దిద్దిన వారి జీవిత విశేషాలపై పాఠకులకు ఆసక్తి ఉంటుంది. సిద్ధాంత గ్రంథాలు, ప్రసంగాలు వెలువడతాయి. అవి నిక్కమైన అనుభవ సారాలు కావు. 'పరేంగిత ప్రజ్ఞ' అచ్చమైన జీవితానుభవం. అద్భుత ఆత్మశోధన. నిరాధారంగా తనలోకి నిష్క్రమించడం అంత సులభం కాదు. దాదా ప్రయోగం అద్భుత ఫలితాల నిచ్చింది. ఆత్మ కథలు రాసుకునేవారు తక్కువ. నిజాల చాటున దాగిన రహస్యాలు బయట కొస్తాయని భయం. దాదాజీ భయాన్ని ఎప్పుడో వదిలిపెట్టి అంతర్యాత్రకు సాహసించినవాడు. కీర్తి, ప్రతిష్టలతో బ్రతికే రాజకీయ, సాహిత్యకారులకు ఉన్న ఆసక్తి యోగులకు ఉండదు. స్వార్థం, కీర్తి దాహం ఉండదు కనుక 'తమ' గురించి లోకానికి తెలియచెప్పేందుకు ఏమీ లేదనుకుంటారు.
దాదా గవంద్ జీవితం సినిమాలాగా సాగదు. అందులో నాటకీయత లేదు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమాలో వలె అడుగుగునా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భయం వేస్తుంది. ఉత్కంఠ కలుగుతుంది. భయ పడినా, చెమట పట్టినా ఆగే ప్రసక్తి లేదు. ఆ టెన్షన్ చాలా మెత్తగా, మృదువుగా మనసులోకి పరుగుదీస్తూ, మనసు తెరల్ని, పొరల్ని చీల్చివేసి, శాన్యంలో జొరబడుతుంది. మనసును తాకకుండా, నెమ్మదిగా పోయి ఆత్మను తట్టిలేపుతుంది. అన్నీ సవ్యంగా ఉంటే ఎవరి జీవితమూ చదవబుద్ధి కాదు. అది సాదా బాక్సాఫీసు సినిమా అవుతుంది. కళాఖండం కాదు. దాదా జీవితంలో నిరాశలు, నిస్పృహలు, ఆరాటాలు, పోరాటాలు, ప్రతిఘటనలు, అన్వేషణ, ఆవేదనలు ఎక్కువ. ప్రతి ఒక్కటి హృదయాన్నికదిలిస్తుంది. అయినవారికి, ఉన్న ఊరికి దూరంగా, ఎక్కడో సజ్జన్ఘడ్ పర్వతంపైన అడవి అంచున, చిన్న కుటీరంలో ప్రమాదాల అంచులు తాకుతూ జీవించడం అనూహ్యం. దేవుడు పిలిచినా రాను పొమ్మనే మొండితనం, మనస్సుతో కుస్తీపట్లు. దాదా ప్రధాన ప్రత్యర్థి మనస్సు. దానిని లొంగ తీసుకున్న తీరు, ఆయన ఆత్మవిజయం ఆధ్యాత్మిక పథం.
Intelligence Beyond Thought కు నేను పెట్టినపేరు ''పరేంగిత ప్రజ్ఞ''. ఈ పేరు చూస్తే ఇది స్వీయకథ అనుకోకపోవచ్చు కాని ఇది నిజమైన ''ఆత్మ'' కథ. పది కాలాలపాటు నిలిచే పుస్తకం అని నా ఆత్మ విశ్వాసం. చదివిన ప్రతి ఒక్కరి గుండెతలుపు తట్టి నిద్రలేపి, చైతన్య పరచగలదని మరొక నమ్మకం.
- శ్రీ శార్వరి
