-
-
మనిషిలో మనిషి - 2
Manishilo Manishi 2
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 259Language: Telugu
హెడ్లైట్ల కాంతిలో బెంజ్‌కారు-
శరవేగంతో పరుగుతీస్తోంది.
పోలీసులు అక్కడ సంఘటనా స్థలానికి చేరుకునేప్పటికే కార్తికేయ సంజనాలు ప్రయాణం చేస్తున్న కారు కుంభకోణం సిటీ లిమిట్స్ దాటేసింది. కార్తికేయ డ్రయివ్ చేస్తున్నాడు. అతడి భుజంమీద తాలాన్చుకుని ఆలోచిస్తోంది సంజనా.
వచ్చిన పని సక్సస్‌ఫుల్‌గా ముగిసింది.
కార్తికేయ చెప్పినట్టే తమ చేతులకు మట్టి అంటలేదు. ఎవరూ తమను వేలెత్తి చూపలేరు. ద్రోహి సత్యానంద అంతమయ్యాడు. అంతా బాగానే వుంది కాని... విచిత్రంగా ఆ టైంలో చచ్చిన ఎద్దు బ్రతికేలా వచ్చింది? అక్కడికి జనాలకే కాదు. తనకీ అర్థంకాలేదు.
“బావా” పిలిచింది.
“వూఁ” అన్నాడు. కాని కార్తికేయ దృష్టి పూర్తిగా డ్రైవింగ్ మీదే లగ్నమై వుంది.
“చిన్న డౌటు?” అంది.
“మన శత్రువు చచ్చాడుగా. ఇంకెవరూ మన జోలికి రారు. ఇంకేమిటి డౌటు?” అడిగాడు.
భుజంమీంచి లేచి అతడి ముఖంలోకి చూసింది సంజనా.
“ఏంలేదూ... ఎనిమిది గంటల క్రితమే ఆ ఎద్దు చచ్చిందన్నారు. అది బతికి రావటం ఏమిటి స్వామీజీని చంపటం ఏమిటి? నమ్మలేకపోతున్నాను. ఎలా బతికింది? నువ్వేమన్నా చేసావా? ఐ మీన్... నీకేదో విద్య తెలుసన్నావుగా. చచ్చిన చింపాజీ కొలంబియాలో బతికినట్టే ఇక్కడ ఈ ఎద్దూ బతికింది. ఏం చేసావ్?” అడిగింది.
“సంజూ... కొన్ని ప్రశ్నలు నువ్వడక్కుండా ఉంటేనే మంచిది” అన్నాడు సీరియస్‌గా.
“చెప్పకూడదా?”
“వూహూఁ”
“నేనడిగినా చెప్పవా?”
“కొన్ని చెప్పకూడదు”
“నాక్కూడ తెలీకూడనంత రహస్యమా?”
ఓసారి ఆమె ముఖంలోకి చూసి నవ్వి “అవును” అన్నాడు.
అయినా వదల్లేదు సంజనా- “పోనీ ఇదన్నా చెప్పు బావా. నీకు తెలిసిన విద్యతోనే ఆ ఎద్దు బతికొచ్చిందా?” అనడిగింది.
“వూఁ” అన్నాడు.
“బతికే ఉంటుందా?”
“ఉండదు. పని పూర్తయిందిగా. అదీ చనిపోయి వుంటుంది”
“వూఁ. ఏదీ సరిగ్గా చెప్పకు” అంటూ తిరిగి ఎడంగా జరిగింది సంజనా
నవ్వి వూరుకున్నాడు కార్తికేయ.ఎప్పుడో మధ్యాహ్నం చేసిన భోజనం. సాయంత్రం కూడ ఏమీ తినలేదు. ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది. ఇద్దరికీ ఆకలిగా వుంది.
“నాకు ఆకలేస్తోంది. ఏమన్నా తినాలి” చాలాసేపటి తర్వాత గొణిగింది సంజనా.
దారిలో ఓ దాబా హౌస్ వద్ద కారాపాడు కార్తికేయ.
ఇద్దరూ భోంచేసి కారు వద్ద కొచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటలయింది సమయం. అప్పటికే శ్రీకుమారశక్తి పీఠాధిపతి స్వామి సత్యానంద మరణం గురించి కుంభకోణం సంఘటన గురించి టీవీ ఛానళ్ళలో స్క్రోలింగ్‌లు రన్నవుతున్నాయి.
“బావా. మనం ఎక్కడికెళ్తున్నాం?” కార్లో కూచోగానే అడిగింది సంజనా.
“ఇంకెక్కడికి..? చెన్నై వెళ్ళిపోదాం ” చెప్పాడు.
“అలాకాదుగాని ఓ మాట చెప్పనా”
“ఏం మాటది?”
“ఎలాగూ దక్షిణాదికొచ్చాం. మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించాలని ఎప్పట్నుంచో కోరిక. మధురై వెళ్దాం. ఏమంటావ్?”
ఎంతో ఉత్సాహంగా అడుగుతున్న సంజనా కోరికను కాదనలేకపోయాడు కార్తికేయ.
కారుదిగి వెళ్ళి అక్కడినుంచి మధురైకి ఎలా వెళ్ళాలో రూటు అడిగి తెలుసుకుని వచ్చి కారు స్టార్ట్ చేసాడు.బహుశ స్వామీజీ మరణంతో ఆ పాపం ఏమన్నా ఉంటే అది తమను అంటకుండా ఉండాలని సంజనా ఉద్దేశం కావచ్చు. అందుకే మధురై మీనాక్షి అమ్మవారి దర్శనంతో ఆగలేదు వారి ప్రయాణం. చుట్టుపక్కల ప్రసిద్ది చెందిన ఇతర ఆలయాలను కూడ దర్శించి నాలుగు రోజుల తర్వాత చెన్నైకి చేరుకున్నారు. ఆరోజు మిత్రుడు మాసిలామణి ఇంట అతిథులుగా వుండి మర్నాడు ఉదయమే పర్లాకిమిడికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈలోపల-
టీవీల్లోను రేడియోల్లోను పత్రికల్లోనూ మీడియాలో కుంభకోణం సంఘటన గురించి పుంకాను పుంఖాలుగా వెలువడుతున్న కథనాలు దేశ ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే వున్నాయి.
Better than Part I