-
-
అలనాటి అమెరికా అనుభవాలు
Alanati America Anubhavalu
Author: Vemuri Venkateswara Rao
Pages: 293Language: Telugu
కొంతమంది జీవితాలని తాము అధిరోహించిన పదవులతో కొలుస్తారు. మరికొంతమంది జీవితాలని తాము సంపాదించిన ఆస్తులు, అంతస్తులతో కొలుస్తారు. ఇంకొంతమంది జీవితాలని తమ అనుభవాలతో, జ్ఞాపకాలతో కొలుస్తారు.
నిశితంగా పరిశీలిస్తే జీవితంలో ప్రతి సంఘటనా అనుభవమే! ప్రతి సన్నివేశమూ జ్ఞాపకమే! ఎటుదిరిగీ వాటిని హృదయంతో సేకరించి పదిలపరచుకొనే నేర్పు ఉండాలంతే... ఇలా పదిలపరచుకోవడం ఒక ఎత్తైతే, వాటికి చక్కటి కథా రూపం కల్పించి , పదిమందికీ పంచి, ఆకట్టుకొనే రచనా శైలి ఉన్న వ్యక్తుల్ని చాల అరుదుగా చూస్తూ ఉంటాం. సమకాలీకుల్లో ఇలాంటి ప్రజ్ఞ ఉన్న ప్రవాసాంధ్ర సాహితీవేత్తలలో ప్రముఖంగా పేర్కొనదగ్గ వ్యక్తి శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు గారు.
ప్రపంచంలో చాలా దేశాల్లో మాదిరిగానే అమెరికాలో కూడ కాలానుగుణంగా చెప్పుకోదగ్గ మార్పులు సంభవించాయి. ముఖ్యంగా గత పది, పదిహేను సంవత్సరాలుగా శరవేగంతో సంభవించిన కంప్యూటర్ సాంకేతిక రంగం పురోభివృద్ధి వల్ల, అమెరికాకి వలస వచ్చిన, అమెరికాలో స్థిరపడిన, ఆంధ్రుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐతే పాతిక, ముప్ఫై ఏళ్ల క్రితం వచ్చిన తెలుగువారి జీవన విధానానికీ, ఇటీవల వస్తున్న తెలుగువారి జీవన విధానానికీ చాలా వ్యత్యాసం ఉంటోంది. దశాబ్దాల క్రితం వచ్చిన తెలుగువారికి అమెరికాలో మరొక తెలుగు వ్యక్తి ఎదురవ్వడమంటే ప్రపంచంలో ఎనిమిదో వింత చూసినంత సంబరంగా ఉండేది. ఆ రోజుల్లో వచ్చిన తెలుగువారిలో అధికులు విద్యార్థులుగా వచ్చినవారే. వారి విద్యార్థి జీవితంలోని అనుభవాలు, టెలిఫోను సౌకర్యాలు సరిగ్గా లేని రోజుల్లో వారు మాతృదేశంలోని బంధువులతో మాట్లాడడానికి పడిన పాట్లు, ఉద్యోగాలకోసం పడిన కష్టాలు, ఊహకి మించిన వేగంతో సంభవించిన సాంకేతిక పురోగతిని అందుకోవడంలో వారికి ఎదురైన అనుభవాలు – వగైరాలన్నీ ఇప్పటి తరం అమెరికా తెలుగువారికే గాక, ఎక్కడున్న తెలుగు వారికైనా ఆసక్తికరంగానే ఉంటాయి. ఇదే ఉద్దేశ్యంతో శ్రీ రావు గారిని తమ పాత జ్ఞాపకాలని “అమెరికా అనుభవాలు” రూపంలో రాసి ఇమ్మని కోరడం జరిగింది. వాటిని 21 నెలలపాటు క్రమం తప్పకుండా ‘సుజనరంజని’ లో ప్రచురించడం ఒక అద్భుతమైన అనుభవం. ఒక్క నెల కూడా అంతరాయం కలగకుండా ఈ వ్యాస, కథానిక పరంపర కొనసాగింది. ప్రతి నెలా అత్యధికంగా చదవబడిన శీర్షికలలో ఇదీ ఒకటిగా ఉండేది.
కేవలం ఆసక్తికరమైన కథనాలే కాకుండా, రచనా శైలి కోణంలో చూస్తే, మనం ఎప్పుడో మరచిపోయిన చక్కటి తెలుగు నుడికారాలు, అందమైన తెలుగు పదాలూ అడుగడుగునా ఎదురొచ్చి మనస్సుకి పులకింతలు కలిగిస్తాయి.
- కిరణ్ ప్రభ

- FREE
- FREE
- ₹162
- ₹162
- FREE
- ₹162