-
-
అడవి పాడింది
Adavi Padindi
Author: Deevi Subbarao
Pages: 106Language: Telugu
అట్లా విడిపించిన జనాన్ని పర్యావరణ పరిరక్షకులు, మానవ హక్కుల సంఘాల వాళ్లు వూరికే పోనివ్వలేదు.
వాళ్లతో ప్రెస్‌క్లబ్‌లో మీటింగ్ పెట్టారు. వారి వూళ్లో ఉన్న చెట్లు వారికెట్లా ప్రాణాధారమయ్యాయో, వాళ్లు వాటిని ఎట్లా సాకుకుంటూ వస్తున్నారో, పోలీసులను వాళ్లు ఎట్లా ఎదుర్కొన్నారో అన్నింటినీ వివరంగా చెప్పవలసిందిగా కోరారు.
ఊరి వాళ్లెప్పుడైనా హైదరాబాదులో ప్రెస్‌క్లబ్బుల్లో మీటింగులు పెట్టారా? పత్రికా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెప్పారా? ఏవీ లేదే! మరి వారెట్లా మాట్టాడతారు? ఏం మాట్లాడుతారు? ఏం సమాధానం చెబుతారు? వాళ్ల కంఠం పట్టుకుపోయింది. నోట మాట రాలేదు. ముక్కుల్లో గాలి బిగుసుకుపోయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అలాంటి పరిస్థితిలో వాళ్లకు తెలియకుండా ఒక అద్భుతం జరిగింది.
వేసిన అడ్డుకట్టను ఒక్కతోపు తోసి ముందుకు వెళ్లిన నీటి ఉరవడిలా, రాతినేలలోంచి పైకి చిమ్ముకొచ్చిన జలధారలా, తల్లి గర్భంలోంచి బహుకష్టంగా బైటపడ్డ పిండంలా, దట్టంగా కమ్మిన చీకట్లోంచి ఒక్క ఉదుటున గెంతి పైకి వచ్చిన ఉదయభానుడిలా వాళ్ల కంఠముడి ఒక్కసారిగా విచ్చుకున్నది. జలజలపారే సెలయేటి నీటి శబ్దంలా, భూమ్మీదపడ్డ శిశువు మొదటి కేకలా, భళ్లున తెల్లారిన ఉదయపు కాంతిలో పక్షుల కిలకిలారావంలా వాళ్ల గొంతుల్లోంచి పాట పెగుల్చుకొని వచ్చింది. వాళ్ల వూరి కథ, అటవీ శాఖవారి కథ, పోలీసుల కథ, జైలు కథ, అందులోంచి బయటపడ్డ కథ పాట రూపంలో వాళ్లలోంచి బైటకు వచ్చి పరవళ్లు తొక్కింది.
అట్లా వాళ్లు ఇరవై ముప్ఫై మంది తలగుడ్డలు చుట్టుకొని వేదికమీద చిందులు వేస్తూ జానపద వీరగాథ, తమ విషాదగాథ గంటసేపు వినిపించారు.
ఆ సమయంలో వాళ్లు చేతులాడిస్తుంటే కొమ్మలు కదలాడినట్లు, వాళ్లు పాడుతుంటే గాలికి చెట్ల కొమ్మలు ఊగి శబ్దం వచ్చినట్లు, అక్కడో చిన్న అడవి మొలిచినట్లు అనిపించింది.
